ఆ 5 స్కీమ్​లకే ఏటా 50 వేల కోట్లు

ఆ 5 స్కీమ్​లకే ఏటా 50 వేల కోట్లు
  • కర్నాటక దివాళా తీస్తుందంటున్న బీజేపీ
  • అవీ ఉచితాలు కావు..ఎంపవర్మెంట్ అంటున్న కాంగ్రెస్

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 ప్రధాన హామీలను అమలు చేసే విషయంపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. ఆ ఐదు హామీల అమలుకే ఏటా రూ.50 వేల కోట్లు అవసరం అవుతాయని, ఈ స్కీంలు అమలుచేస్తే కర్నాటక దివాళా తీస్తుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ అసలు ఈ హామీలను అమలు చేయలేదంటున్నారు. కాంగ్రెస్ తన వాగ్దానాలను పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేదని చెప్తున్నారు. అయితే, ఇవి ఉచిత పథకాలు కావని.. పేదలు, మహిళలు, నిరుద్యోగ యువత సాధికారత కోసం చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ హామీల అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పథకాల అమలుపైనా చర్చలు జోరందుకున్నాయి. 

ఆ ఐదు స్కీమ్​లు ఇవే.. 

కర్నాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే గృహ జ్యోతి పథకం కింద ప్రతి బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామని, గృహ లక్ష్మి స్కీం కింద కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ. 2 వేల ఆర్థిక సాయం చేస్తామని, అన్న భాగ్య పథకం కింద కుటుంబంలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని, యువనిధి స్కీం కింద డిగ్రీ చదివిన నిరుద్యోగులకు రూ. 3 వేలు, డిప్లొమా చేసిన 18 నుంచి 25 ఏండ్లలోపు నిరుద్యోగులకు రూ. 1500 భృతి ఇస్తామని, శక్తి స్కీం కింద రాష్ట్రమంతటా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 

అమలు సాధ్యమే.. కాంగ్రెస్ 

కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కేఈ రాధాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాము ఇచ్చిన హామీల అమలు సాధ్యమేనని చెప్పారు. ‘‘కర్నాటక రాష్ట్ర బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లు. ఇందులో ఈ ఐదు స్కీంలకు ఏటా రూ.50 వేల కోట్లు అవసరం. ఇతర స్కీంలు, జీతాల వంటి వాటికి కలిపి రూ.1.50 లక్షల కోట్లు అవుతాయి. అయితే, బడ్జెట్ లో రూ.1.50 లక్షల కోట్లను ‘క్యాపిటల్’ రూపంలో ఖర్చు చేస్తే.. ప్రభుత్వానికి రెవెన్యూ రూపంలో రూ.1.50 లక్షల కోట్లు వస్తాయి. ఈ ఖర్చు, ఆదాయం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ స్కీంలను అమలు చేయడం సాధ్యమే” అని ఆయన చెప్పారు.