- 22 గంటల పాటు కొనసాగిన సహాయక చర్యలు
- సెల్లార్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్ డంప్
- ప్రమాదానికి లిఫ్ట్ పవర్ సప్లై బోర్డులో షార్ట్ సర్క్యూటే కారణం!
- ఫర్నిచర్ షాపు ఓనర్ అరెస్ట్
- ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5లక్షల పరిహారం
బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్ అబిడ్స్ లోని బచాస్ ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు డెడ్బాడీలు వెలికితీశారు. మొత్తం నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్‌లో శనివారం సాయంత్రమే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ సెల్లార్లో ఉంచిన ఫర్నిచర్, ముడి సరుకులు మండుతూనే ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం దాకా సహాయక చర్యలు కొనసాగాయి. 22 గంటల పాటు శ్రమించి 20 ఫైరింజన్లతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆదివారం ఉదయం 10 గంటల టైమ్‌లో ఒక డెడ్‌బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. తర్వాత 2 గంటలకు మొత్తం 5 మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. వాచ్మెన్ యాదయ్య కొడుకులు అఖిల్ (12), ప్రణీత్ (9), హౌస్ కీపింగ్ కార్మికురాలు బేబీ (52), ఫర్నిచర్ షాపులో పనిచేసే మహ్మద్ ఇంతియాజ్ (27), డ్రైవర్ హాబీబ్ (40) మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సెల్లార్లో డబుల్ సెల్లార్లు ఉండటం, పెద్ద ఎత్తున ఫర్నిచర్, ముడి సరుకులు నిల్వ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
సెల్లార్లో అక్రమంగా ఫర్నీచర్ డంప్: ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్
సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది 2 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. ‘‘సెల్లార్లో ఫర్నిచర్ మెటీరియల్, రెజిన్, వివిధ రకాల కెమికల్స్‌ను అక్రమంగా నిల్వ చేయడంతో మంటల తీవ్రత పెరిగింది. ఈ కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది. మెట్లపై భద్రపర్చిన ఫర్నిచర్‌కు కూడా మంటలు అంటుకోవడంతో ఐదుగురు లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
ర్యాంప్ వేలో కూడా మంటలు చెలరేగాయి. సెల్లార్లో షటర్ ఏర్పాటు చేయడం కూడా ప్రమాదానికి కారణం. సెల్లార్లను పార్కింగ్ కోసమే ఉపయోగించాలి. వాణిజ్య అవసరాలకు యూజ్ చేయొద్దు’’అని విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు.
ఊపిరాడకనే ఐదుగురు మృతి
ఫర్నిచర్ షాప్ ఓనర్ సతీశ్ బచాను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని అబిడ్స్ ఏసీపీ, కేస్ ఇన్వెస్టిగేషన్ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సెల్లార్ పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ ఉంచడంతో మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు. అలాగే, సెల్లార్లో ఐదుగురు ఊపిరాడక చనిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
కాగా, జేఎన్టీయూ ఇంజనీర్స్ ఎక్స్ పర్ట్ కమిటీ అధికారి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం బిల్డింగ్‌ను పరిశీలించింది. పిల్లర్లు పటిష్టంగా ఉన్నట్లు గుర్తించింది. కాగా, ప్రమాదం సంభవించిన ముందు రోజే బిల్డింగ్ లిఫ్ట్ రిపేర్ చేయడమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. లిఫ్ట్ రిపేర్ జరిగిన 24 గంటల్లోనే సెల్లార్లో ఉన్న లిఫ్ట్ పవర్ సప్లై బోర్డులో నుంచి మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మంత్రులు పొన్నం, పొంగులేటి దిగ్ర్భాంతి
అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని, సంబంధిత షాపు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటనలో పేర్కొన్నారు.
