
హైదరాబాద్ రామాంతాపూర్ లోని గోకలే నగర్ లో ఆగస్టు 17న అర్ధరాత్రి జరిగిన శ్రీకృష్ణుడి రథయాత్ర ఘటన అందరినీ కలిచివేస్తోంది. కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు చూస్తేనే కన్నీళ్లు వస్తున్నాయి.
అప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతోన్న శ్రీకృష్ణుడి రథయాత్రలో ఒక్కసారిగా అరుపులు, కేకలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. రథయాత్రకు విద్యుత్ షాక్ తగలడంతో చెల్లాచెదురుగా పడిపోయారు. రథాన్ని లాగుతోన్న వారిలో ఐదుగురు అక్కడిక్కడే ఉలుకూ పలుకూ లేకుండా కిందపడిపోయారు. అక్కడ ఉన్న వారికి ఏమైందో తెలిసే లోపే వారు మృత్యువాత పడ్డారు. సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. హాస్పత్రికి తరలించే లోపే వాళ్లు చనిపోయారని డాక్టర్లు చెప్పారు. ఈ అనుకోని ఘటనలో అక్కడున్న వాళ్లంతా ఉలిక్కి పడ్డారు. భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 17న రాత్రి 12 గంటలకు కరెంటు వైర్ కిందికి వేలాడడంతో ప్రమాదం జరిగింది. రాత్రి శోభాయాత్ర ముగిసిన తర్వాత రథాన్ని తీసుకెళ్లే జీపు మొరాయించడంతో యువకులు స్వయంగా లాక్కొని వెళ్లారు.. హై టెన్షన్ వైర్ల నుంచి కిందికి ఒక వైర్ వేలాడుతుండడంతో రథానికి తాకి నిప్పు రవ్వలు వచ్చాయి. రథాన్ని పట్టుకున్న వాళ్లంతా ఒక్కసారిగా దూరంగా పడిపోయారు. రథంపై ఉన్న పూజారికి మరికొందరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రథం పట్టుకొని లాక్కెల్తున్న వారికి మాత్రమే కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే వారిని సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశాం. పోలీసులు స్పాట్ కు వచ్చిన తర్వాత వారి వాహనంలో అందరినీ హాస్పిటల్ కి తరలించాం. హాస్పిటల్ వెళ్లేలోపే ఐదుగురు చనిపోయారని వైద్యులు చెప్పారు. మరి కొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఎలక్ట్రిసిటీ వైరే ప్రమాదానికి కారణం. మా కళ్ళముందే అందరూ చెల్లాచెదురుగా పడిపోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
►ALSO READ | దీపావళి ముందు ఆటో రంగానికి జీఎస్టీ రిలీఫ్..! మోడీ ప్రకటన తర్వాత స్టాక్స్ ర్యాలీ..
ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని యశోద, కేర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతులు కృష్ణ యాదవ్(24), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేందర్ రెడ్డి(39)లుగా గుర్తించారు.