- ఓటర్లకు బాకీ కార్డు చూపుతున్న బీఆర్ఎస్ పార్టీ
- చార్జిషీట్ పేరుతో బీజేపీ నేతల ప్రచారం
- అభివృద్ధి, స్థానికత, ఎంఐఎం మద్దతు, బీసీ కార్డు, పథకాలు అస్త్రాలుగా కాంగ్రెస్
- కాంగ్రెస్ కు ప్లస్ గా అజార్ కు మంత్రి పదవి!
- హోరాహోరీగా సాగుతున్న బైపోల్ క్యాంపెయిన్
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా రంగంలోకి దిగారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేయని హామీలనే ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. బీజేపీ నేతలు చార్జిషీట్ పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది. స్థానికుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం, మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, బస్తీల్లో సీసీ రోడ్లు నిర్మాణం, ఎంఐఎం మద్దతు తదితర అంశాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటోంది. ఇదిలా ఉండగా అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించడం కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది.
►ALSO READ | సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా..?: కవిత సంచలన వ్యాఖ్యలు
మైనార్టీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున హస్తం పార్టీకి మద్దతు లభిస్తోంది. ముగ్గురు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి తోడు మంత్రులు సీతక్క, జూపల్లి తదితరులు ఫీల్డ్ లో ఉంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. రోడ్ షోలు నిర్వహిస్తూ.. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు సంధిస్తున్నారు. ఏ పార్టీకి జనం జై కొడతారన్నది త్వరలోనే తేలనుంది.
ప్రధాన పార్టీలకు కలిసొచ్చే ఫైవ్ ఫాక్టర్స్ ఇవే:
కాంగ్రెస్ పార్టీ
- అధికార పార్టీ కావడంతో అభివృద్ధి కోసం కొట్టే చాన్స్
- ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో పెరిగిన గెలుపు అవకాశాలు
- అజారుద్దీన్ కు మంత్రి పదవి కూడా కలిసొచ్చే చాన్స్
- ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుండటం, సన్నబియ్యం పథకం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ప్రచారంలోకి దిగడం
బీఆర్ఎస్
- ఆరు గ్యారెంటీల పై బాకీ కార్డుల ద్వారా ప్రచారం
- మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చే సానుభూతి
- క్షేత్ర స్థాయిలో వర్క్ చేసే కేడర్ ఉండటం
- మూడు టర్మ్ లు గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉండటం
- కమ్మ సామాజిక వర్గం ఓట్లు కలిసొచ్చే చాన్స్
బీజేపీ
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాకాలో సెగ్మెంట్ ఉండటం
- వరుసగా ఎమ్మెల్సీలు గెలవడం, మోదీ మేనియా
- ఎంఐంఎకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తొత్తులంటూ ప్రచారం
- జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగడం
- లంకల దీపక్ రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు
