
అల్లదుర్గం, వెలుగు: ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానంతో ఐదుగురి ప్రాణాలు దక్కాయి. మండల పరిధిలోని చేవెళ్ల గ్రామానికి చెందిన మధునురోళ్ల శ్రీకాంత్ హైదరాబాద్ కొండాపూర్ కిమ్స్ లో పనిచేసేవాడు. దసరాకు ఇంటికి వచ్చిన అతడు ఈ నెల 5న బైక్ మీద హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా సంగారెడ్డి శివారులో మరో బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సంగారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.
తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడిన శ్రీకాంత్ కు మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. డాక్టర్ల సూచన మేరకు బాధను దిగమింగుకొని శ్రీకాంత్ అవయవాలను దానం చేయడానికి భార్య సారిక, తల్లిదండ్రులు నాగమణి, శివరాజ్ అంగీకరించారు. సమాచారం అందుకున్న జీవన్ దాన్ సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్ బాడీ నుంచి లివర్, లంగ్స్, కిడ్నీలు, గుండె సేకరించి ఐదుగురికి అమర్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.