ఓవర్‌‌ స్పీడ్‌కు ఐదుగురు బలి.. ఆటో, బైక్‌ను వేగంగా ఢీకొట్టిన డీసీఎం వ్యాన్​

ఓవర్‌‌ స్పీడ్‌కు ఐదుగురు బలి.. ఆటో, బైక్‌ను వేగంగా ఢీకొట్టిన డీసీఎం వ్యాన్​
  • స్పాట్‌లో ముగ్గురు, హాస్పిటల్‌లో ఇద్దరు మృతి.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
  • డీసీఎంకు నిప్పు పెట్టిన స్థానికులు.. పోలీసులపైనా దాడికి యత్నం
  • రాత్రి దాకా కొనసాగిన ఆందోళనలు.. కిలోమీటర్ల మేర నిలిచిన వెహికల్స్

బాలానగర్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‌తో దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్.. ఆటో, బైక్‌ను ఢీకొనడంతో ఐదుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జనం.. డీసీఎంకు నిప్పుపెట్టారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా దాడికి యత్నించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో ప్రతి శుక్రవారం వారాంతపు సంత జరుగుతుంది. ఈ క్రమంలో సంతకు రాజాపూర్ మండలం బీబీనగర్‌‌కు చెందిన పన్ని (55), ఆమె మనుమరాలు జున్ను (3), అదే గ్రామానికి చెందిన జశ్వంత్ (10), మౌనిక, మధ్యప్రదేశ్​కు చెందిన భద్ర సింగ్ తదితరులు ఆటోలో వచ్చారు.

బాలానగర్ మండలం మోతిఘన్​పూర్‌‌‌‌కు చెందిన దంపతులు రాజు, సునీత(28).. తమ కూతురుతో మోక్ష(11)తో కలిసి బైక్‌‌పై వచ్చారు. వీరంతా సరుకులు తీసుకుని తమ ఊర్లకు బయల్దేరారు. సంత నుంచి బయటకు వచ్చి నేషనల్ హైవేపై రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్.. ఓవర్ స్పీడ్‌‌తో ఆటోను, పక్కనే వెళ్తున్న బైక్‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న జున్ను, పన్ని.. బైక్​పై ఉన్న మోక్ష స్పాట్​లోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సునీత, జశ్వంత్, రాజు, మౌనిక, భద్రాసింగ్‌‌లను మహబూబ్​నగర్ జనరల్ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సునీత, జశ్వంత్ మృతి చెందారు. రాజు పరిస్థితి సీరియస్​గా ఉండటంతో హైదరాబాద్​కు తరలించారు. మౌనిక, భద్రసింగ్​కు మహబూబ్​నగర్​లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గాయపడిన వారిని కలెక్టర్ జి.రవినాయక్ పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.

డీసీఎంకు నిప్పుపెట్టి ఆందోళన

ప్రమాదం ధాటికి ఆటో, బైక్‌‌పై ఉన్న వారంతా చల్లా చదురుగాపడ్డారు. పోలీసులు హుటాహుటిన స్పాట్‌‌కు చేరుకొని డెడ్​బాడీలను మహబూబ్​నగర్ జనరల్ హాస్పిటల్​కు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే టైంలో ప్రజలు ఆందోళనకు దిగారు. డీసీఎంకు నిప్పు పెట్టారు. పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు పోలీసులపైనే దాడి చేసేందుకు యత్నించారు. డీసీఎంలో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ రాగా, దానికీ ప్రజలు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఫైర్ సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారు. రాత్రి పది గంటల వరకు నేషనల్ హైవేపై ట్రాఫిక్ క్లియర్ కాలేదు. ఎనిమిది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.