లోక్ జనశక్తిలో చీలిక..పార్టీ చీఫ్ పై ఎంపీల తిరుగుబాటు

లోక్ జనశక్తిలో చీలిక..పార్టీ చీఫ్ పై ఎంపీల తిరుగుబాటు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) రెండుగా చీలిపోయింది.  ఐదుగురు ఎంపీలు  పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్​పై  తిరుగుబాటు చేశారు. చిరాగ్ పాశ్వాన్ చిన్నాన్న,  హాజీపూర్​ ఎంపీ పశుపతి కుమార్ పరాస్ ను లోక్​సభలో తమ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ఈమేరకు ఆదివారం రాత్రి లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాను కలిసి సమాచారం ఇచ్చారు. ఎల్జేపీకి లోక్ సభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. కిందటేడాది తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పటి నుంచి చిరాగ్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. ఆయన పనితీరు పట్ల పార్టీ  ఎంపీలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో జరిగిన పరిణామాలపై పశుపతి కుమార్ పరాస్ సోమవారం మాట్లాడుతూ.. తాను పార్టీని చీల్చలేదని, కాపాడానని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ తన అన్న కొడుకని, ఆయనపై తనకు ఎలాంటి కోపంలేదని చెప్పారు. తాను ఎన్డీఏతోనే ఉన్నానని అన్నారు. బీహార్ సీఎం నితీశ్​ కుమార్ మంచి లీడర్, వికాస పురుషుడని మెచ్చుకున్నారు. తాజా పరిణామాలపై చిరాగ్ పాశ్వాన్ స్పందించలేదు. సోమవారం ఢిల్లీలోని  పరాస్ ఇంటికి వెళ్లిన చిరాగ్.. భేటీ కోసం ప్రయత్నించారు. అయినా పరాస్ ఆయనను కలవలేదు.