టీబీతో రోజుకు ఐదుగురు మృతి

టీబీతో రోజుకు ఐదుగురు మృతి
  • టీబీతో రోజుకు ఐదుగురు మృతి
  • మూడేండ్లలో 6,247 మరణాలు

హైదరాబాద్, వెలుగు : టీబీని నయం చేసే మెడిసిన్ అందుబాటులోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ వేలమంది ఆ జబ్బుకు బలవుతున్నారు. టీబీ నిర్మూలనకు పెట్టుకున్న గడువు 2025లో ముగుస్తుండగా, మన రాష్ట్రంలో టీబీతో ఇప్పటికీ రోజుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజూ కనీసం రెండొందల మంది కొత్తగా టీబీ బారినపడుతున్నారు. ఈనెల 24న వరల్డ్  టీబీ డే  నేపథ్యంలో గత మూడేండ్లుగా రాష్ట్రంలో నమోదవుతున్న టీబీ కేసులు, మరణాల వివరాలను ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మూడేండ్లలో 6,247 మంది ఆ జబ్బుతో మరణించారని తెలిపింది. అయితే 2020--–2021తో పోలిస్తే మరణాల రేటు తగ్గిందని పేర్కొంది.

క్షయ నిర్మూలనలో  హైదరాబాద్ టాప్

క్షయవ్యాధి నిర్మూలనలో రాష్టంలో హైదరాబాద్ జిల్లా టాప్ గా నిలిచింది. సోమవారం ఉప్పల్‌‌లోని మేఖల గార్డెన్స్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో క్షయ వ్యాధి నిర్మూలనకు విశేష కృషి చేసిన జిల్లాలకు అవార్డులు అందజేశారు.  హైదరాబాద్ జిల్లా ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో అవార్డుకు ఎంపికైంది. దీంతో హైదరాబాద్  డీఎంహెచ్‌‌వో  డాక్టర్ వెంకటి ఉత్తమ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా అవార్డును అందుకున్నారు.  వైద్యారోగ్య కార్యక్రమాల అమలులో, క్షయవ్యాధి నిర్మూలనలో డా. వెంకటి కృషిని ఉన్నతాధికారులు అభినందించారు. 2022–23లో 14వేల క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించాల్సి ఉండగా.. 15వేల కేసులను గుర్తించి 113 శాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు.