కోరుట్ల, వెలుగు : నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురు వ్యక్తులను కోరుట్ల పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబందించిన వివరాలను బుధవారం డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కోరుట్లలో కొబ్బరిబోండాలు అమ్మే వ్యక్తికి పది రోజుల కింద ఓ వ్యక్తి నకిలీ రూ. 500 నోటు ఇచ్చాడు. దీంతో ఆయన కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సురేశ్ బాబు ఆధ్వర్యంలో రెండు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
Also Read :- ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్ మహ్2024
అయితే కోరుట్ల తిలక్‌రోడ్డులోని ఓ ఇంట్లో ఉన్న కొందరు వ్యక్తులు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు తెలియడంతో సీఐ సురేశ్‌బాబు, ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి వెళ్లారు. పోలీసులను చూసిన ఐదుగురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకొని ప్రశ్నించారు. వారిని తనిఖీ చేయగా రూ. 500 నోట్లు కనిపించాయి. వాటి గురించి పోలీసులు ప్రశ్నించగా నకిలీ నోట్లు అని ఒప్పుకున్నారు. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 1.61 లక్షల విలువైన రూ.500 నోట్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సైని ఎస్పీ అభినందించారు.