దేశంలో 70 శాతం కరోనా మరణాలు ఐదు రాష్ట్రాల్లోనే

దేశంలో 70 శాతం కరోనా మరణాలు ఐదు రాష్ట్రాల్లోనే

కరోనా నమోదు సంఖ్య వివరాలను తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. దేశంలో కరోనా మరణాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని, ఆగస్టు మొదటి వారంలో 2.15 శాతం ఉంటే ఇప్పుడది 1.70 శాతానికి చేరుకుందని చెప్పింది. అయితే.. దేశంలో నమోదవుతున్న కరోనా మరణాల్లో ఎక్కువగా ఐదు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశంలో 70 శాతం కరోనా మరణాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయన్నారు.

అంతేకాదు… దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఈ ఐదు రాష్ట్రాల నుంచే 62 శాతం కేసులు వస్తున్నాయన్నారు. దేశం మొత్తం మీద 5 వేలకు తక్కువగా కరోనా కేసులు ఉన్న రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు 14 ఉన్నాయని తెలిపారు. 28 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాల రేటు జాతీయ సగటు 1.70 శాతం కన్నా ఎక్కువగా ఉందని రాజేశ్ భూషణ్ చెప్పారు. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 53 కరోనా మరణాలు సంభవిస్తున్నాయని, ప్రపంచంలో అతి తక్కువ మరణాలు నమోదవుతున్న దేశాల్లో మనమూ ఉన్నామన్నారు.