జూబ్లీహిల్స్, వెలుగు: ప్రమాదవశాత్తు లిఫ్ట్ డోర్లో ఇరుక్కొని ఐదేండ్ల బాలుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్ పేట ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ జీ504లో ఐశ్వర్య, నర్సినాయుడు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి రెండో కొడుకు హర్షవర్ధన్(5) బుధవారం లిఫ్ట్ వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్నాడు.
అనంతరం లిఫ్ట్ ఐదో అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు వెళ్లి ఆగింది. చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు బాలుడిని గుర్తించి బయటకు తీయగా, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని మధురానగర్ పోలీసులు పరిశీలించి, డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
