ఇండోర్ కోడిగుడ్ల బండి బాలుడికి ఫ్లాట్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్

ఇండోర్ కోడిగుడ్ల బండి బాలుడికి ఫ్లాట్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్

ఇండోర్ లో మూడు రోజుల క్రితం లంచం ఇవ్వలేదని బాలుడి కోడిగుడ్ల బండిని అధికారులు తోసేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన బాధితుడు పరాస్ రాయకర్ కు దేశం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. చాలామంది ఆ బాలుడికి ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు తమకు సాయం చేయడానికి ముందుకొచ్చారని ఆ బాలుడి కుటుంబం తెలిపింది. అంతేకాకుండా.. ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మండోలా ఆ కుటుంబానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇల్లు కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్.. పరాస్ రాయకర్ చదువుకు ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు. అక్కడి ఇండోర్ ప్రెస్ క్లబ్ కూడా బాలుడి కుటుంబానికి కావలసిన రేషన్ ను మరియు కొంత డబ్బును అందించింది.

ఈ ఘటనకు సంబంధించి రాయకర్ కుటుంబానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ‘బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మండోలా.. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఫ్లాట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాయకర్ కు ఒక సైకిల్ మరియు 2,500 రూపాయలు కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ రూ .10,000 ఆర్థికసాయం చేసి.. రాయకర్ చదువుకు సాయం చేస్తానన్నారు. రాహుల్ గాంధీ కార్యాలయం మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం నుంచి కూడా మాకు సాయం చేస్తామని కబురువచ్చింది. బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కూడా మాకు సాయం చేస్తానన్నారు’అని రాయకర్ తాత తెలిపారు.

మధ్యప్రదేశ్ లో కరోనావైరస్ తీవ్రత కారణంగా షాపులను తెరిచేందుకు ‘ఎడమ-కుడి’ నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే గురువారం పరాస్ రాయకర్ తన కోడిగుడ్ల బండిన రోడ్డు పక్కన పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. అటుగా వచ్చిన మునిసిపల్ సిబ్బంది.. కోడిగుడ్ల బండిని అక్కడి నుంచి తీసేయాలని లేకపోతే రూ. 100 లంచం ఇవ్వాలని అన్నారు. దానికి రాయకర్ ఒప్పుకోలేదు. దాంతో మునిసిపల్ సిబ్బంది.. కోడిగుడ్ల బండిని తోసేశారు. గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి. కరోనా వల్ల ఇప్పటికే వ్యాపారం జరగడంలేదంటే.. మళ్లీ వీళ్ల వల్ల మరికొంత నష్టం కలిగిందని రాయకర్ పేర్కొన్నాడు.

For More News..

ఆరు కిలోమీటర్లకు రూ. 9,200 డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్