- నీట్ రీటెస్ట్ ఫలితాలను ప్రకటించిన ఎన్టీఏ
- హర్యానాలోని ఓ సెంటర్‌లో తారుమారైన మార్కులు
న్యూఢిల్లీ: గత మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షల్లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. పలు సెంటర్లలో అప్పట్లో వచ్చిన ఫలితాలకు రీటెస్ట్ రిజల్ట్స్‌కు భారీగా తేడాలొచ్చాయి. హర్యానాలోని ఓ సెంటర్‌లో ఇదివరకు ఆరుగురు స్టూడెంట్లకు 720 మార్కులకు గాను 720 రాగా, రీటెస్ట్ ఫలితాల్లో కేవలం ఒక విద్యార్థికి మాత్రమే 682 మార్కులు వచ్చాయి. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన రీటెస్ట్ ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది.
హర్యానాలోని బహదూర్‌ఘర్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్‌లో 494 మంది విద్యార్థులు నీట్ రీటెస్ట్‌కు హాజరయ్యారు. అందులో ఒకరికి మాత్రమే 682 మార్కులు వచ్చాయి. మరో 13 మంది విద్యార్థులకు 600కు పైగా మార్కులు వచ్చాయి. కాగా, గత నీట్ పరీక్షల్లో పలువురికి గ్రేస్ మార్కులు కలపడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని గ్రేస్ మార్కులను రద్దు చేసింది. మార్కులు కలిపిన 1,563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఎగ్జామ్ నిర్వహించగా, 800 మంది హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిటీల వారీగా ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది.
మే 5న దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 పరీక్షా కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఇందులో 14 సెంటర్లు విదేశాల్లో ఉన్నాయి. పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఎగ్జామ్‌ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అయితే, పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చిన కేంద్రాల్లో మాత్రమే ప్రభుత్వం నీట్ ఎగ్జామ్‌ను మళ్లీ నిర్వహించింది. మరోవైపు, బిహార్ హజారీగాగ్‌లోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్‌లో 701 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇక్కడ అత్యధిక స్కోర్ 700 కంటే తక్కువగా ఉంది. ఏడుగురు విద్యార్థులు 650 కంటే ఎక్కువ, 23 మందికి 600 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి.
