
అఫ్గానిస్తాన్‌లో ప్లేన్ క్రాష్.. 83 మంది చనిపోయారని అనుమానం
ఏరియానా ఎయిర్‌లైన్స్ దేనంటూ ప్రచారం.. తమ విమానాలన్నీ సేఫ్ అంటూ కంపెనీ ప్రకటన
అఫ్గాన్‌లో సోమవారం ఓ విమానం కూలిపోయింది. ఘజ్నీ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. నేలను తాకిన వెంటనే మంటలు అంటుకుని, కాలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న వారు ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశంలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కూలిపోయిన విమానం అఫ్గాన్ ఏరియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిందని, ప్రమాదం జరిగిన టైంలో అందులో 83 మంది ప్రయాణిస్తున్నారని లోకల్ అధికారులు చెప్పారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలను ఏరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్ కొట్టిపారేసింది. తమ విమానాలన్నీ సేఫ్‌గానే ఉన్నాయని, క్రాష్ అయిన విమానం తమది కాదని ఓ ప్రకటన విడుదల చేసింది. అఫ్గాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా దీనిని కన్ఫర్మ్ చేసింది. ఘజ్నీ ప్రావిన్స్‌లో కమర్షియల్ ఫ్లైట్ కూలిపోయినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. విమానం కూలిపోయిన విషయాన్ని ఘజ్నీ గవర్నర్ అధికార ప్రతినిధితో పాటు, లోకల్ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఘజ్నీ ప్రావిన్స్ లోని చాలా గ్రామాలు తాలిబన్ మిలిటెంట్ల ఆధీనంలో ఉండడంతో ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకోవడం కష్టమవుతోందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై తాలిబన్ల ప్రతినిధి స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న యాక్సిడెంట్ ఫోటోలను పరిశీలిస్తే కూలిపోయిన విమానం అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్లాగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్లేన్ క్రాష్ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అమెరికా కంట్రోల్ కమాండ్ అధికార ప్రతినిధి మేజర్ బెత్ రియోర్డన్ చెప్పారు.
అక్కడ ప్రమాదాలు కామనే..
అఫ్గాన్‌లో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లు.. ముఖ్యంగా హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువని అధికారులు చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, కాలంచెల్లినా సరే విమానాలను, హెలికాప్టర్లను ఉపయోగించడం వల్ల అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. 2013లో అమెరికన్ బోయింగ్ 747 కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. నార్త్ కాబూల్ నుంచి దుబాయ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఏడుగురు సిబ్బంది చనిపోయారు. 2010లో పామిర్ ఎయిర్వేస్కు చెందిన ప్యాసింజర్ ప్లేన్ క్రాష్ ల్యాండ్ అయింది. కుందుజ్ నుంచి కాబూల్ వెళుతుండగా బ్యాడ్ వెదర్ కారణంగా ఈ ప్లేన్ కూలిపోయింది. ఈ విమానంలోని 38 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది చనిపోయారు.