
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, కేంద్ర పారా మిలటరీ బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నై నుంచి శ్రీలంకకు వెళ్లిన ఓ శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో పహల్గాం దాడికి పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులకు శనివారం (మే 3) బెదిరింపు ఇమెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. విమానంలో ఐదుగురు వెల్ ట్రైన్డ్ ఎల్ఈటీ టెర్రరిస్టులు ఉన్నారని.. ఇందులో ఎటువంటి అనుమానం లేదని మెయిల్లో పేర్కొన్నారు.
దీంతో చెన్నై విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మెయిల్ వచ్చే సమయానికి విమానం చెన్నై నుంచి టేకాఫ్ అయ్యి శ్రీలంకకు వెళ్లడంతో ఈ విషయాన్ని అక్కడి అధికారులకు సమాచారం అందించారు చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు. విమానంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారని.. విమానాన్ని వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరారు. చెన్నై అధికారుల సూచన మేరకు.. శ్రీలంక పోలీసులు కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు లేరని అక్కడి అధికారులు నిర్ధారించారు.
దీంతో ఇది నకిలీ మెయిల్ అని గుర్తించిన చెన్నై ఎయిర్ పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విమానంలో టెర్రరిస్టులు ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులకు మెయిల్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత భారత, పాక్ మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు భారత్ నుంచి శ్రీలంక వెళ్లి అక్కడి నుంచి పాక్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.