
ముంబై: దేశీ విమాన ప్రయాణీకుల సంఖ్య 2020 ఏప్రిల్-–డిసెంబర్ తో పోలిస్తే 2021లో ఇదేకాలంలో 44 శాతం తగ్గి 111 లక్షలకు పడిపోయిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. అయితే 2020 డిసెంబర్‌తో పోలిస్తే 2021 డిసెంబరులో వీరి సంఖ్య 52 శాతం పెరిగింది. 2020 డిసెంబర్ లో మొత్తం దేశీయ ప్రయాణీకుల సంఖ్యను 73 లక్షలుగా లెక్కించారు. ఒమిక్రాన్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో రిస్ట్రిక్షన్లు పెట్టడంతో ఇక నుంచి ప్రయాణికుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే గత ఏడాది నవంబరుతో పోలిస్తే డిసెంబరులో ప్యాసింజర్ల సంఖ్య ఆరుశాతం వరకు పెరిగి 1.05 కోట్లుగా రికార్డయింది. రోజూ సగటున 2,800 మంది డొమెస్టిక్ విమానాల్లో వెళ్తున్నారు. 2020 డిసెంబరుతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. 2021 నవంబరులో రోజూ సగటున 2,700 మంది విమానాల్లో వెళ్లారు. గత ఏడాది నవంబరులో ఒక్కో విమానంలో సగటున 129 మంది ప్రయాణించగా, డిసెంబరులో ఈ సంఖ్య 130కి పెరిగింది. నవంబరు కంటే డిసెంబరులో డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉన్నా కరోనా కారణంగా ఇక నుంచి టికెట్ల సంఖ్య తగ్గొచ్చని ఇక్రా పేర్కొంది. గత 12 నెలల్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు 49 శాతం పెరిగాయని తెలిపింది.