- జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయం
- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు: విద్యార్థుల్లో శాస్ట్రీయ భావాలు పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అన్నారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్ సంబరాల వాల్ పోస్టర్‌ను ఆయన శనివారం రిలీజ్ చేశారు. చెకుముకి పరీక్షలో హైదరాబాద్ విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ 36 ఏండ్లుగా విద్యార్థుల్లో శాస్త్రీయ భావాలు పెంపొందించడానికి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరీక్షను నాలుగు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పరీక్ష జరుగుతుందని, 8, 9 ,10 వ తరగతి చదివే విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనాలని కోరారు.
వివిధ స్థాయి పరీక్షల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఏటా నగరంలో 20 వేల మంది పరీక్షకు హాజరవుతున్నారన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల వరప్రసాద్, సోషల్ మీడియా సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్పీ లింగస్వామి, జేవీవీ హైదరాబాద్ నగర నాయకులు రవీంద్రబాబు, శ్రీనివాస్, భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.