- ఇక నీళ్లపైనే విందులు, వినోదాలు
- 3 కోట్లు కేటాయించిన కేంద్రం
- కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ
- సోమశిల, భద్రాద్రికి కూడా కొత్త బోట్లు
- సిటీ జనం కోసం సాగర్, దుర్గం చెరువులనూ డెవలప్ చేసేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: ప్రకృతి అందాల నడుమ జల విహారం చేసేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతుండటంతో ఆ దిశగా రాష్ట్ర పర్యాటకశాఖ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర ఆలయానికి వచ్చే టూరిస్టుల కోసం ఫ్లోటింగ్రెస్టారెంట్(నీటిలో తేలియాడే రెస్టారెంట్)ను అందుబాటులోకి తీసుకురానున్నది. రామప్పకు వెళ్లేవారు ఇకపై ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో కూర్చొని విందులు, వినోదాలతో ఆనందంగా గడపవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ స్కీం కింద రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. వచ్చేనెల 4వ తేదీ వరకు గడువు విధించారు. ఇది పూర్తయితే పనులు మొదలుపెట్టి పర్యాటకులకు ఫ్లోటింగ్రెస్టారెంట్ అందుబాటులోకి తేనున్నారు.
సోమశిల, భద్రాద్రికి కొత్త సొబగులు
రామప్పతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాలపైనా పర్యాటక శాఖ ఫోకస్ పెట్టింది. కొల్లాపూర్ దగ్గరున్న సోమశిల, భద్రాద్రిలో బోటింగ్ కోసం కొత్త బోట్లను కొనుగోలు చేస్తున్నది. సోమశిల బ్యాక్ వాటర్‌లో జాయ్‌రైడ్స్ కు ఫుల్ డిమాండ్ ఉండటంతో అక్కడ బోట్ల సంఖ్యను పెంచనున్నది. సోమశిలకు ఒక బోటు మంజూరు కాగా.. కేంద్ర ప్రభుత్వం రూ.2.2 కోట్లు, భద్రాద్రిలో ఒక బోటుకు అనుమతి రాగా.. రూ. 2 కోట్లు మంజూరు చేసింది. వీటికి కూడా టెండర్లు పిలిచారు.
దుర్గం చెరువుల్లోనూ కొత్త అట్రాక్షన్స్
హైదరాబాద్ జనాల కోసం హుస్సేన్ సాగర్, దుర్గం చెరువుల్లోనూ కొత్త అట్రాక్షన్స్ తీసుకురావాలని ఆఫీసర్లు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ బోటింగ్ నడుస్తున్నా.. కొత్త తరహా బోట్లు, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వీకెండ్స్‌లో వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్లోటింగ్ రెస్టారెంట్లలో చిన్న ఫంక్షన్లు, డిన్నర్లు, బర్త్ డే పార్టీలు చేసుకోవచ్చు. బార్ సైతం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని మరో 8 ప్రాంతాల్లో బోట్లకు డిమాండ్ ఉంది.
పరిగి, జొన్నలబొగూడ, వార్దవెల్లి, రాయిగిరి, పర్ణశాల, భద్రాచలం, బోరంచ, నిజాంసాగర్ లో అవసరం ఉందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో మొత్తం 99 బోట్లు నడుస్తున్నాయి. అందులో 35 స్పీడ్ బోట్లు ఉన్నాయి. వీటితో పాటు 21 పెడల్ బోట్లు, 19 పాంటూన్ బోట్లు, 9 డీలక్స్ బోట్లు, 6 క్రూయిజ్ బోట్లు, 5 మెకనైజ్డ్ బోట్లు, 4 అమెరికన్ పాంటూన్ బోట్లు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి.
బోటింగ్‌తోనే రూ.13 కోట్ల ఆమ్దానీ
పర్యాటకశాఖకు బోటింగ్ ద్వారా ఆదాయం సమకూరుతున్నది. గతేడాది కేవలం బోటింగ్ ద్వారానే సర్కార్ ఖజానాకు రూ.13 కోట్ల ఆదా యం వచ్చింది. సౌకర్యాలను మరింత పెంచి తే ఆదాయం డబుల్ అయితదని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. అందుకే రామప్పలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాంటి కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు కేరళ, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లోనే చూసిన హౌస్ బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇప్పుడు మన దగ్గర కూడా ఏర్పాటు కాబోతున్నాయి. రామప్ప సరస్సులో ఏర్పాటు చేసే ఈ రెస్టారెంట్‌లో.. నీళ్లపై తేలుతూనే డిన్నర్లు చేయొచ్చు. బర్త్‌డేలు, చిన్న చిన్న గెట్టు టుగెదర్ పార్టీలు చేసుకునేలా డిజైన్ చేస్తున్నారు.
