వట్టివాగుకు భారీగా పెరిగిన వరద

వట్టివాగుకు భారీగా పెరిగిన వరద
  • ఎగువ ప్రాంతాల నుండి కొనసాగుతున్న వరద ప్రవాహం

కొమరం భీమ్ జిల్లా: వట్టి వాగు ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. తొలకరి వర్షాలతో మొదలైన వరద రోజు రోజుకూ పెరుగుతోంది. ఎగువన పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇవాళ ఇన్ ఫ్లో ఏకంగా 1,946 క్యూసెక్కులకు చేరింది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ఎగువ నుండి వస్తున్న వరద నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వస్తున్న వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 239.500 మీటర్లు కాగా ప్రస్తుతం 238.500 మీటర్లు ఉంది. ఇన్ ఫ్లో 1846 క్యూసెక్కులు ఉండగా.. మూడు గేట్లు ఎత్తి 2167 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తి నీటివిడుదల ప్రారంభిస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని.. జాలర్లు, రైతులు వరద పెరుగుతున్న విషయం గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.