హిమాచల్పై ప్రకృతి ప్రకోపం.. మనాలిని ముంచేసిన వరదలు.. రోడ్లు, బిల్డింగులు, ట్రక్కులు.. అన్నీ నీళ్లలోకే !

హిమాచల్పై ప్రకృతి ప్రకోపం.. మనాలిని ముంచేసిన వరదలు.. రోడ్లు, బిల్డింగులు, ట్రక్కులు.. అన్నీ నీళ్లలోకే !

ప్రకృతి అందాలతో భూతల స్వర్గాన్ని తలపించే హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు జలవిలయంలో చిక్కుకుంది. ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్లు. భారీ వర్షాలకు కొండలపై నుంచి నదులు పొంగి పొర్లుతున్నట్లుగా ఘోరమైన వరదలు ముంచెత్తడంతో గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. జనాలు నిలువనీడ లేక విలవిలలాడుతున్నారు. 

గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా సోమ, మంగళ వారాల్లో (ఆగస్టు 25, 26) మనాలిలో క్లౌడ్ బరస్ట్ కావడంతో.. ఊహించలేనంత నష్టం వాటిల్లింది. భారీ వరదలకు షాపులు కొట్టుకుపోయాయి.. బిల్డింగులు కూలిపోయాయి.. హైవేలన్నీ కోతకు గురై లోయలను తలపిస్తున్నాయి. కొన్ని గ్రామాలలో ఇండ్లు కొట్టుకుపోగా.. మరికొన్ని ఇండ్లు బురదలో కూరుకుపోయాయి. 

భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగుతోంది. మంగళవారం బియాస్ వరదల కారణంగా పెద్ద బిల్డింగు నేలకూలింది. అదే విధంగా షాపులు కొట్టుకుపోయాయి. మనాలి-లెహ్ హైవే మొత్తం బ్లాక్ అయిపోయినట్లు అధికారులు ప్రకటించారు. రోడ్లన్నీ ధ్వంసం అవ్వడంతో దారులన్నీ మూసుకుపోయి.. చాలా ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారని తెలిపారు. 

మనాలిలోని బహంగ్ లో రెండు అంతస్తుల బిల్డింగు వరదలో కొట్టుకుపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. అదే విధంగా రెండు రెస్టారెంట్లు, రెండు షాపులు కూడా కూలిపోవడం చూస్తే అక్కడ పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

చూస్తుండగానే కొట్టుకుపోయిన హెవీ లోడెడ్ ట్రక్కు:

పూర్తిగా లోడ్ చేసుకుని వస్తున్న పెద్ద ట్రక్కు చూస్తుండగానే వరదలో బోల్తా పడింది. వరద తీవ్రతకు ఒక్కసారి బోల్తాపడి కొట్టుకుపోయింది. బరువుతో ఉంది కదా వాగును దాటొచ్చు అనుకున్నట్లుంది డ్రైవర్. కానీ దురదృష్టవషాత్తు వరదల్లో కొట్టుకుపోయింది. ఆ ట్రక్కు ఎంత వరకు కొట్టుకుపోయిందో కూడా ట్రేస్ చేయలేకపోయారు అధికారులు. భారీ వరదల కారణంగా మనాలీ-లెహ్ హైవేను మూసేశారు. అదే విధంగా కుల్లూ-మనాలి మధ్య ఉన్న హైవే పూర్తిగా కొట్టుకుపోయినట్లు అధికారులు ప్రకటించారు. 

బియాస్ నదిలో వాటర్ లెవల్స్ పెరగడంతో ఇండ్లతో పాటు పత్లికుహల్ లోని ఫ్యాక్టరీలోకి నీళ్లు చేరుకున్నాయి. ఒక్కసారిగా బలంగా వచ్చిన నీళ్ల తాకిడికి ఫ్యాక్టరీలోని వస్తువులు కొట్టుకుపోయాయి. 

హెవీ రెయిన్ అలర్ట్ లోనే హిమాచల్ ప్రదేశ్:

ఇప్పటికే హిమాచల్ పూర్తిగా ధ్వంసం అవ్వగా.. ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని రెయిన్ అలర్ట్స్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు భిక్కుభిక్కుమంటూ భయాందోళన నడుమ గడుపుతున్నారు.  మండిలో రెండు బిల్డింగులతో పాటు 40 షాపులు కొట్టుకుపోయాయి. కన్నూర్ జిల్లాలో కన్వీ గ్రామం వరదలకు పూర్తిగా ధ్వంసం అయినట్లు ప్రకటించారు. 

శిమ్లా జిల్లాలో అన్ని స్కూళ్లకు హాలీడే ప్రకటించారు. సోమవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పాటు చెట్లు వేళ్లతో సహా కూలిపోయాయి. దీంతో రోడ్లన్నీ బ్లాకయ్యాయి. కాంగ్రా, చంబా, లహాల్ స్పిటీ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఉనా, హమిర్పూర్, బిలాస్పూర్, సొలాన్, మండీ, కుల్లు, షిమ్లా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

హిమాచల్ ప్రదేశల్ లో ఎన్నడూ లేనంత వానలు ఈసారి కురుస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 20 నుంచి కంటిన్యూగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయ్యింది. రోడ్లు, హైవేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట పొలాలు పూర్తిగా నష్టపోవడంతో ఆహార కొరతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.