పోలవరం ప్రాజెక్టుతో వరద ముంపు తక్కువే

పోలవరం ప్రాజెక్టుతో వరద ముంపు తక్కువే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలవరం ప్రాజెక్టుతో వరద ముంపు తక్కువేనని  సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తేల్చిచెప్పింది. ప్రాజెక్టు నుంచి గరిష్ట స్థాయి ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లో 36 లక్షల క్యూసెక్కులు ఉన్నప్పుడు భద్రాచలం వద్ద అడుగున్నర ఎత్తులో మాత్రమే ముంపు ప్రభావం అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరికి ఎట్టి పరిస్థితుల్లోనూ 50 లక్షల క్యూసెక్కుల వరద రాదని, అలాంటప్పుడు 50 లక్షల క్యూసెక్కుల వరదతో ఎగువ ప్రాంతాల్లో పడే ప్రభావంపై అధ్యయనం చేయబోమంది. శుక్రవారం సీడబ్ల్యూసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే గుప్తా అధ్యక్షతన పోలవరం ముంపు ప్రభావం ఉండే రాష్ట్రాల టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ఢిల్లీలో సమావేశమయ్యారు. గోదావరిలో 36 ఉప నదులు కలుస్తున్నాయని, ఒక్కో నదిలో ప్రవాహం 40వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం ఉంటుందని తెలంగాణ ఇంజనీర్లు వివరించారు. పోలవరం వద్ద పూర్తి కెపాసిటీతో నీటిని నిల్వ చేస్తే ఈ నదుల్లోని నీళ్లు గోదావరిలో కలువకుండా పైకి ఎగతన్ని ముంపు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఈ నదుల్లో వరదలపై ఈనెల 19లోగా పూర్తి స్థాయి నివేదిక అందించాలని, ఆ తర్వాతే దానిపై చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పోలవరం స్పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వే డిశ్చార్జి కెపాసిటీ 58 లక్షల క్యూసెక్కులకు లెక్కగట్టి, అంత వరద వస్తే ఎగువన పడే ముంపుపై అధ్యయనం చేయాల్సిందేనని చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒడిశా ఇంజనీర్లు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గోదావరిలో కలిసే ఉప నదులపై అసలు అధ్యయనమే అవసరం లేదని ఏపీ ఇంజనీర్లు వాదించారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలంగాణ ఈఎన్సీలు మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే, గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుబ్రమణ్య ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒడిశా, ఏపీ ఈఎన్సీలు, పోలవరం సీఈ సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు పాల్గొన్నారు.