టీఆర్ఎస్​ పార్టీ వాళ్లకే వరద సాయం ఇస్తున్రు

టీఆర్ఎస్​ పార్టీ వాళ్లకే వరద సాయం ఇస్తున్రు

మహదేవపూర్, వెలుగు :  ‘వరద సాయం అందరికియ్యాలే.. టీఆర్ఎస్​ పార్టీల ఉన్నోళ్లకే ఇచ్చి మాకు ఇయ్యకపోతే ఎట్లా? ’ అంటూ వరద బాధితులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కి ధర్నా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో గత నెల గోదావరి ఉప్పొంగి పుష్కర ఘాట్ దాటి సుమారు 800 మీటర్ల దూరం వరకు ప్రవహించింది. వరదకు 84 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సర్వే చేసిన అధికారులు వీరికి వరద సాయం అందజేయాలని ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపారు. అయితే బుధవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురికి మాత్రమే రూ.10 వేల చొప్పున వరద సాయం అందింది. ఇందులోనూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురున్నారు. దీంతో వరద సాయం అందని కుటుంబాల్లోని మహిళలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. కాళేశ్వరం బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు భాగ్య మాట్లాడుతూ లిస్టులో అనర్హుల పేర్లు ఉన్నాయని, తమ లాంటి నిజమైన బాధితులకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా ఇంటికి ఇటు పక్కోళ్లకు పైసలిచ్చిన్రు..అటు పక్కోళ్లకూ ఇచ్చిన్రు...నాకు మాత్రం ఇయ్యలే’ అని వాపోయింది. తమ దగ్గర వివరాలు తీసుకుని, టీఆర్ఎస్ పార్టీ లీడర్ల సంబంధీకులకు పైసలిచ్చారని ఆరోపించింది.