నాగార్జునసాగర్‌కు పోటెత్తుతున్న వరద

నాగార్జునసాగర్‌కు పోటెత్తుతున్న వరద
  •      22 క్రస్టు గేట్లు ఎత్తివేత
  •     3,76,535  క్యూసెక్కులు విడుదల 
  •      భారీగా పెరిగిన పర్యాటకుల సంఖ్య  

హాలియా, వెలుగు: శ్రీశైలం డ్యాం నుంచి వరద పోటెత్తుతుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. దీంతో అధికారులు డ్యాం 22 రేడియల్‌ క్రస్టు గేట్లను10  ఫీట్ల మేరకు ఎత్తు ఎత్తి 3,76,535 క్యూసెక్కులను పులిచింతలకు, దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నాగార్జునసాగర్ కు 3,54,663 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని కిందికి వదులుతున్నారు. 

585 అడుగుల నీటి మట్టం..

సాగర్​ ప్రాజెక్టు 590అడుగుల (312.50 టీఎంసీ లు) కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 585.10 అడుగులు(297.7235 టీఎంసీలు)గా నమోదైంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 8,067 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,022 క్యూసెక్కులు, విద్యుత్​ఉత్పత్తి ద్వారా 28,420 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతోంది. 

పర్యాటకుల సందడి

22 గేట్లను ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పాటు బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం, సమ్మక్క సారక్క, ప్రధాన డ్యాం, శివాలయం ఘాట్, పవర్ హౌస్, అనుపు, కొత్త వంతెన, పాత వంతెన, ప్రధాన గేట్లు, కొత్త బ్రిడ్జిలను  విజిట్​చేస్తున్నారు. దీంతో హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథి గృహం వెనక ఉన్న నూతన లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పులను పర్యాటక శాఖ నడుపుతోంది. ఆంధ్ర ప్రాంతంలోని ఎత్తిపోతల జలపాతాన్ని చూసేందుకు కూడా పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.