వరద సాయం కోసం బాధితుల ఎదురుచూపు

వరద సాయం కోసం బాధితుల ఎదురుచూపు
  • మూడు జిల్లాల్లోనే ఆఫీసర్ల సర్వే
  • 35 వేలకుపైగా బాధిత కుటుంబాలుంటాయని అంచనా
  • సంఖ్యను 20 వేల లోపు తగ్గించేలా ప్లాన్
  • ఇప్పటికీ నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కార్
  • భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 
  • పునరావాస కేంద్రాల ఎత్తివేత 

హైదరాబాద్, వెలుగు: తక్షణ సాయం రూ.10 వేలు ప్రకటించి వారం అవుతున్నా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు రూపాయి కూడా అందలేదు. ఆఫీసర్లు ఏదో మొక్కుబడి సర్వే చేసుకొనిపోతున్నారని బాధితులంటున్నారు. కొందరి పేర్లే రాసుకున్నారని.. అందరివి రాసుకోలేదని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలూ వస్తున్నాయి.

వారమైతున్నా అందలేదు

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ ప్రతి బాధిత కుటుంబానికి తక్షణం రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారంతో ఈ ప్రకటనకు సరిగ్గా వారం రోజులవుతోంది. అయినా ఇంతవరకు వరద సాయానికి సంబంధించి ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. మరోవైపు ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకే ఈ సాయం పరిమితం చేసింది. ఈ జిల్లాల్లోనే వరద సాయం చేయడానికి ఆఫీసర్లు సర్వే చేశారు. దీంతో వరదలతో నష్టపోయిన ఇతర జిల్లాల బాధితులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

భారీ సంఖ్యలో బాధిత కుటుంబాలు

వారం పది రోజుల పాటు భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గ్రామాలు నీట మునగడంతో వేల కుటుంబాలు పునరావాస కేంద్రాలు, బంధువుల ఇండ్లలో తలదాచుకున్నాయి. ఉన్నతాధికారులకు జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు లక్ష మందికి పైగా వరదలతో ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 70 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. ఇలా అన్ని కలిపితే దాదాపు 35 వేల కుటుంబాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లోనే ఉంటారని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి డేటా తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఇంకా సర్వే పూర్తి కాగాపోగా, ములుగులో దాదాపు 5 వేల కుటుంబాలు, జయశంకర్ భూపాలపల్లిలో సుమారు 4 వేల కుటుంబాలను వరద సాయం కోసం గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం 10 వేల కుటుంబాలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మొత్తంగా సాయం అందించేది 20 వేల లోపు కుటుంబాలకే అని సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. మరోవైపు అన్ని కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉన్నామని త్వరగా సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.