శ్రీశైలానికి మొదలైన వరద .. జూరాల నుంచి 37,124 క్యూసెక్కులు

శ్రీశైలానికి మొదలైన వరద ..  జూరాల నుంచి 37,124 క్యూసెక్కులు

హైదరాబాద్/శ్రీశైలం/గద్వాల/మదనాపురం, వెలుగు:  జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి వరద వస్తున్నది. ఈ సీజన్​లోనే మొదటిసారిగా రిజర్వాయర్ కు ఇన్​ఫ్లో మొదలైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల దాదాపు నిండింది. దీంతో రెండు పవర్​హౌస్​ల ద్వారా కరెంట్​ఉత్పత్తి చేస్తూ కృష్ణా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి విడుదల చేసిన నీటితో పాటు లోకల్​క్యాచ్​మెంట్​ఏరియాలోని వరద కలిసి శ్రీశైలంలోకి 37 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటల వరకు ప్రాజెక్టుకు 22,573 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా, మధ్యాహ్నం 3 వరకు 37,124 క్యూసెక్కులకు పెరిగింది. 

ప్రాజెక్టు కెపాసిటీ 215.8070 టీఎంసీలు కాగా, 33.7658 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మహాబలేశ్వర్ ​ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నది. ఈ ప్రాజెక్టు దాదాపు సగం నిండింది. రెండ్రోజుల పాటు శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద పోటెత్తగా.. ఆదివారం ప్రవాహం తగ్గింది. ఎగువన మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ఎస్సారెస్పీకి వరద పెరిగే అవకాశముందని ఇరిగేషన్​ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇంకో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రాజెక్టు ఇంజనీర్లు అలర్ట్​గా ఉన్నారు. 

శ్రీశైలం నిర్మించి నేటికి 60 ఏండ్లు..

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి సోమవారానికి 60 ఏండ్లు అయింది. 1963 జులై 24న అప్పటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 20 ఏండ్లు ఆనకట్ట నిర్మాణం జరిగింది. 1977 దాకా యంత్రాలు వాడకుండా పనులు చేసినా, తర్వాత టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మెషినరీ ఉపయోగించారు. ఆనకట్ట నిర్మాణం 1983లో జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 306 టీఎంసీలు కాగా, పెద్ద మొత్తంలో పూడిక చేరడంతో ప్రస్తుతం 215 టీఎంసీలకు పడిపోయింది. 12 రేడియల్ క్రస్ట్ గేట్లు, రెండు రివర్ సూయిన్ గేట్లు ఉన్నాయి. 

జూరాలలో విద్యుత్ ఉత్పత్తి.. 

జూరాల ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద వస్తున్నది. దీంతో జూరాల హైడల్ ప్రాజెక్ట్​ దగ్గర నాలుగు యూనిట్లలో విద్యుత్  ఉత్పత్తిని ప్రారంభించారు. కర్నాటకలోని చిత్తాపూర్  తాలూకాలో భీమా నదిపై ఉన్న సనత్ బ్యారేజీ నుంచి జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జూరాల నుంచి లెఫ్ట్ కెనాల్​కు 820 క్యూసెక్కులు, ప్యారలాల్ కెనాల్ కు 850 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–2కు 850 క్యూసెక్కులు, విద్యుత్  ఉత్పత్తి కోసం 37,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిరుమలాయపల్లి దగ్గర రాజీవ్ గాంధీ భీమా–1 లిఫ్ట్ మోటార్​ను అధికారులు ఆదివారం ఆన్ చేశారు. ఒక మోటార్ ద్వారా 750 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.