- అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఆగిన రోడ్డు విస్తరణ పనులు
 - హైదరాబాద్–బీజాపూర్ హైవేలో ఈ ఒక్కచోటే అడ్డంకులు
 - మర్రి చెట్లను కాపాడాలని ఎన్జీటీకి వెళ్లిన సేవ్ బనియన్స్ సంస్థ
 
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్-– బీజాపూర్ హైవే (ఎన్‌హెచ్-163)లో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ జరగకపోవడం వల్లే.. ఈ దారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న హైవేను 2018లో స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ అయింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) 2022లో పనులు ప్రారంభించగా, మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు ఇప్పటికే పూర్తయింది. కానీ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర మాత్రం పనులు ఆగిపోయాయి.
రోడ్డుకు ఇరువైపులా సుమారు 900 మర్రి చెట్లు ఉండగా, వీటిని కాపాడాలని 'సేవ్ బనియన్స్' అనే సివిల్ సొసైటీ గ్రూప్ బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో 2021, 2023లో ఎన్‌జీటీలో పిటిషన్లు వేసింది. దీంతో ట్రిబ్యునల్ స్టే ఇచ్చి పనులను ఆపేసింది. ఫలితంగా రోడ్డు విస్తరణ ఆలస్యమవడంతో ప్రమాదాలు కొనసాగుతున్నాయి. రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడం, రోడ్డు చిన్నగా ఉండడంతో రోజూ ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి సర్కారులోని ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో 2018 నుంచి ఇప్పటి వరకు 200 మందికి పైగా చనిపోయారు.
పర్యావరణ వేత్తలతో చర్చలు సఫలం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు సమస్యకు పరిష్కారం దొరకలేదు. కాంగ్రెస్సర్కారు వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్సొంత నియోజకవర్గాలకు వెళ్లే రోడ్డు ఇదే కావడం, మరోవైపు ఈ దారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో సమస్యను సీరియస్ గా తీసుకున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సమక్షంలో ‘సేవ్ బనియన్స్’ సంస్థకు చెందిన పర్యావరణవేత్తలతో చర్చలు జరిపారు.
765 చెట్లు కాపాడుతామని, 150 చెట్లు రీలొకేట్చేస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు కేసు విత్ డ్రా చేసేందుకు అంగీకరించారు. అలైన్ మెంట్ లో మార్పులకు సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టును ఎన్జీటీకి సమర్పించారు. అక్టోబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌జీటీలో కూడా వాదనలు వినిపించి స్టేను ఎత్తివేయించింది. 46 కిలోమీటర్ల ఫోర్-లేన్ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి, పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది.
ఇలా పనులు..
రోడ్డును రెండు వైపులా కలిపి 60 మీటర్లకు విస్తరించాల్సి ఉండగా..సెంట్రల్ మీడియన్ స్థలాన్ని 5 మీటర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం డిజైన్మార్చి తొలుత 5 మీటర్లుగా ప్రతిపాదించిన సెంట్రల్ మీడియన్‌ను ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు. ఈ మూడున్నర మీటర్ల భాగాన్ని ప్రధాన రోడ్డుకు కలిపి చెట్ల చేరువ వరకు రోడ్డును విస్తరిస్తారు. చెట్ల ఆవల మరోవైపు రోడ్డు నిర్మిస్తారు. అంటే ప్రధాన రోడ్డుకు మధ్యలో చెట్లు ఉంటాయి. వాహనాలకు ఇబ్బందిగా మారే కొమ్మలను తొలగిస్తారు. 150 చెట్లు మాత్రం ఈ డిజైన్‌కు అనుకూలంగా లేకపోవడంతో, రీలొకేట్ చేయనున్నారు. వీటికి ఇప్పటికే రెడ్ మార్క్ వేశారు. రీడిజైన్ ద్వారా రోడ్డు వంకరలు లేకుండా సమానంగా ఉంటుంది.
ఆది నుంచి అడ్డంకులే..
స్టేట్ హైవేగా ఉన్న ఈ రోడ్డును కేంద్రం 2018లో ఎన్‌హెచ్163గా అప్‌గ్రేడ్ చేసి రూ.928.41 కోట్లతో నాలుగు లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారుల చట్టం-1956 కింద 2018 జూలై, 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటి ప్రకారం సర్వే చేసిన అధికారులు కొత్త అలైన్ మెంట్ కు అవకాశం ఉన్నా..పాత మార్గాన్ని విస్తరించేందుకే మొగ్గు చూపారు. ఈ మార్గంలో 900 మర్రి చెట్లతో పాటు వేల సంఖ్యలో ఇతర చెట్లు పోతుండడంతో 2021లో ‘సేవ్ బనియన్స్’ సంస్థ ఎన్‌జీటీలో కేసు వేసింది. దీంతో టీజీపీఏ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయాయి. 2023లో నవంబర్‌లో ఎన్‌జీటీ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడంతో పాటు ఈఐఏ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
