హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నెం. 239, 240లో బీఆర్‌ఎస్ పార్టీకి 11 ఎకరాల భూ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటరు దాఖలుకు రెండు వారాలు గడువు ఇచ్చింది. 2023లో జరిగిన ఈ కేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి, ఎం.వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.
మార్కెట్ విలువ ప్రకారం.. రూ.500 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే కేటాయింపు చేయడం అన్యాయమని పిటిషనర్ న్యాయవాది వాదించారు. కౌంటరు దాఖలుకు గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. దాంతో కోర్టు విచారణను డిసెంబరు 10వ తేదీకి వాయిదా వేసింది.
