- గోదావరి పుష్కరాలకు శాశ్వత ఏర్పాట్లు: మంత్రి కొండా సురేఖ
 
హైదరాబాద్, వెలుగు: ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్ ను రూ.50 కోట్లతో రూపొందించామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, పండితులు, భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2027 జూలైలో వచ్చే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం సెక్రటేరియెట్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తో కలిసి సురేఖ ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్ తోపాటు గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రణాళికలపై దేవాదాయశాఖ అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని కోరారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ కు అవసరమైన స్థల సేకరణ వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గంలో కొలువైన స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
