పుట్టపర్తి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణాలు ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘటన మరువక ముందే ఏపీలో మరో ఘోరం జరిగింది. సత్య సాయి జిల్లాలో జబ్బర్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. జబ్బర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిద్రమత్తు ఒక మహిళ ప్రాణం తీసింది. ఈ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా, 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి హైవేపై ఈ ఘటన జరిగింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గుబావిగూడెం దగ్గర మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. నార్కెట్ పల్లి-అద్దంకి హైవేపై బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్ ఉన్నట్టుండి పల్టీ కొట్టింది. ఊహించని ఈ పరిణామంతో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడన్గా బ్రేకులేయండంతో బస్సులో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. బస్సు కావలి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయాలైన వారికి మిర్యాలగూడ హాస్పిటల్లో చికిత్స అందించారు.
