
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడ, గంగారం మండలాలు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. కొత్తగూడెం నుంచి నర్సంపేట వెళ్లే రహదారిలో ఉన్న గాదె వాగు గుంజేడుతోగు రోడ్డు పైనుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాకాలకు వరద పెరిగింది. గంగారం మండలం కోమట్ల గూడెం పెద్ద చెరువు మత్తడి పోస్తోంది. ఫలితంగా కాటినగర సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మధ్యలోనే ఆపేశారు.
బుధవారం చేపల వేటకు వెళ్లిన కొత్తగూడ కు చెందిన ఆగబోయిన నరేశ్రాళ్లతొట్టి వాగులో గల్లంతయ్యాడు. అతని ఆచూకీ ఇంకా లభించలేదని ఎస్సై రవికుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గురువారం అత్యధికంగా కొత్తగూడలో 75.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సీతానగరం శివారుకొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీముని, బయ్యారం పెద్దగుట్టపై ఉన్న పాండవుల, చింతోనిగుంపు జలపాతాల వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు.