
సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల పది రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతికి భవానీ మాత ప్రధాన ఆలయ మండపం, ప్రాంగణం అస్తవ్యస్తమైంది. గుర్రపు డెక్క కొట్టుకు వచ్చి ఆలయ మండపంలో జాలీ, రెయిలింగ్ మధ్య పేరుకుపోయింది. పెద్ద మొత్తంలో మట్టి పేరుకుపోయి అపరిశుభ్రంగా మారింది. వరద తాకిడికి క్యూ లైన్ లు, బ్రిడ్జిల రెయిలింగ్ దెబ్బతిన్నాయి.
మండపం పైకప్పు రేకులు ధ్వంసం అయ్యాయి. స్నాన ఘట్టాల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే రేకుల షెడ్డు కొట్టుకుపోయింది. ప్రసాదం విక్రయించే షెడ్డు కొంత మేర దెబ్బతిన్నది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గాక ఆలయాన్ని, మండపాన్ని, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు, అవసరమైన రిపేర్లు చేపడతామని ఈవో చంద్రశేఖర్ తెలిపారు. గర్భగుడి శుభ్రం చేసి సంప్రోక్షణ చేశాక అమ్మవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. - మెదక్/పాపన్నపేట, వెలుగు