ఫ్లోరిడాలో కొత్త చట్టం..టీచర్లకు తుపాకులు

ఫ్లోరిడాలో కొత్త చట్టం..టీచర్లకు తుపాకులు

మయామి(అమెరికా): స్కూళ్లలో కాల్పుల సంఘటనలను అడ్డుకునేందుకు ఫ్లోరిడా ఓ కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. టీచర్లు క్లాస్​రూంలలోకి తుపాకీ తీసుకెళ్లేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. స్టూడెంట్లు ఎవరన్నా రివాల్వర్​తీసుకొచ్చి కాల్పులకు తెగబడే ప్రయత్నం చేస్తే తమ దగ్గరున్న ఆయుధంతో టీచర్లు వారిని అడ్డుకోవడానికి, ఉన్మాదులు, సైకోల నుంచి స్టూడెంట్లను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. దీనికి ముందు టీచర్లకు ఆయుధాల వాడకంపై144 గంటల ట్రైనింగ్​ఇవ్వాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. క్లాస్​రూంలలో కాల్పుల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో టీచర్ల చేతికి ఆయుధాలు అందించాలనే డిమాండ్​చాలా కాలంగా వినిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో పార్క్​లాండ్​హైస్కూళ్లో జరిగిన కాల్పుల ఘటనలో 17 మంది చనిపోవడంతో ఈ డిమాండ్​మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో ప్రభుత్వం కొత్త బిల్లును సెనేట్​లో ప్రవేశపెట్టింది. సెనేటర్ల ఆమోదం తర్వాత బుధవారం బిల్లును హౌస్​ఆఫ్​రిప్రజెంటేటివ్స్​ముందుకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బిల్లును రిపబ్లికన్​గవర్నర్​అనుమతి కోసం పంపించినట్లు పేర్కొంది. అయితే, కాల్పుల సంఘటనలను అడ్డుకోవడానికి ఇలా టీచర్లకు లైసెన్స్​ఇవ్వడం కరెక్ట్​కాదని కొంతమంది వాదిస్తున్నారు. చిన్న పిల్లలు, మానసిక రోగులకు ఆయుధాలు అందకుండా చేయడమే సరైన నిర్ణయమని చెబుతున్నారు. గవర్నర్​ఈ బిల్లును ఆమోదిస్తే.. ఫ్లోరిడా స్కూలు టీచర్లు ఒక చేతిలో పుస్తకాలు, మరో చేతిలో రివాల్వర్​తో క్లాస్​రూంల్లోకి అడుగుపెడతారు.