
తినడానికి తిండిలేకున్నా మనిషి గుక్కెడు నీళ్లు తాగి ప్రాణాల్ని నిలుపుకోగలడు. మన భూగోళంలో నాలుగింట మూడొంతుల భాగం నీటితో నిండి ఉన్నా నీటి కరువు వెంటాడుతోంది. భూమిలోపలి పొరల్లో నిక్షిప్తమైన నీటిని పైకి తోడుకుంటున్న క్రమంలో ఆ నీటిలోని 'ఫ్లోరైడ్' ప్రజల జీవితానికి గుదిబండగా మారుతోంది. 'ఫ్లోరోసిస్' అనేమాట 1930లో తొలిసారిగా మోల్లర్, గుడ్జోనసోన్ అనే ఇరువురు డేనిష్ ఆరోగ్య కార్యకర్తలు గుర్తించారు.
సరైన మోతాదులో ఫ్లోరిన్ శరీరానికి అందినప్పుడు ఎముకలు సరిగ్గా రూపొందుతాయి. ఒకవేళ శరీరంలోకి అధికంగా ఫ్లోరిన్ చేరినప్పుడు ఎముకల సాంద్రత పెరుగుతుంది. శరీరంలో ఫ్లోరైడ్ అధికంగా ఉండడం వల్ల ఎముకల్లోకి కాల్షియం అధికంగా చేరుతుంటుంది. కొన్ని సందర్భాలలో ఎముకల పెరుగుదల అధికం కావడం, వంకర్లు పోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. గత నాలుగున్నర దశాబ్దాల్లో పోలియోను ప్రపంచ దేశాలు చాలావరకు నిలువరించగలిగాయి.
పోలియోను మన దేశం పూర్తిగా తరిమికొట్టినట్లు 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. 1981లో ప్రపంచవ్యాప్తంగా 65,737 పోలియో కేసులు వెలుగు చూశాయి. 1984 నాటికి అవి 35వేలకు దిగివచ్చాయి. 1989లో మళ్లీ 39,683కు ఎగబాకి, 2001 నాటికి 496కు తగ్గిపోయాయి. ఇటీవలి కాలంలో పోలియో మళ్లీ కోరలు చాస్తోంది. ఆసియా, ఆఫ్రికాలలోనే అది ఎక్కువగా విజృంభిస్తోంది.
ఏడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసులు పెరుగుతున్నాయి. 2017లో 118 కేసులుండగా, 2023 నాటికి 536కు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇందులో పిల్లల సంఖ్య అధికంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
2024లో ఫ్లోరైడ్ కేసుల నమోదు
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాగునీటిలో ఫ్లోరైడ్ సాంద్రత 0.5 నుంచి 1.0 పిపియం (పార్ట్స్ ఫర్ మిలియన్) వరకు ఉండాలని సిఫార్సు చేసింది. అయితే, నల్గొండలోని 3,477 ప్రభావిత గ్రామాలలో ఫ్లోరైడ్ స్థాయిలు 3.0 నుంచి 28 పిపియం వరకు ఉన్నాయి. ఇందువల్ల ఇక్కడి గ్రామాల్లో పర్యటిస్తేచాలు ఫ్లోరోసిస్ వ్యాధి విశ్వరూపం ఏమిటో స్పష్టమవుతుంది.
వందలాది పిల్లలు శాశ్వతమైన అంగవైకల్యం పొందారు. ఆందోల్ మండలం ఎర్రారం గ్రామంలోని పాఠశాలలో సుమారు 20 మందికిపైగా విద్యార్థులు ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు కావడం విషాదం. ఎముకలు, దంతాలను ప్రభావితం చేసే వికలాంగ వ్యాధులతో ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు. వాస్తవానికి ఫ్లోరోసిస్‌ను ఎదుర్కోవడానికి 1940 నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
దీంతో నిజాం ప్రభుత్వం ఉపరితల నీటి ప్రాజెక్టులను ప్రారంభించింది. 1975లో నల్గొండ టెక్కిక్, నెదర్లాండ్ మద్దతుతో డీ-–ఫ్లోరైడేషన్ ప్లాంట్లను ప్రవేశపెట్టింది. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చాయి. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో 480 మంది జలసాధన సమితి సభ్యులు పోటీలో నిలిచి ఫ్లోరైడ్ సమస్యను ప్రపంచం దృష్టికి తెచ్చారు.
భూగర్భ జలాల్లో అధిక ఫ్లోరైడ్
ప్రతి ఏడాది ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న మండలాల్లోని పాఠశాల విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నారు. కానీ, 2024లో ఈ జిల్లాలో తిరిగి ఫ్లోరైడు కేసులు నమోదుకావడంతో ఈ ప్రాంత ప్రజల్లో భయం మొదలైంది. తెలంగాణలో ఫ్లోరైడ్ కాలుష్యం పెద్ద ముప్పుగా కొనసాగుతోందని జలశక్తి మంత్రిత్వశాఖ విడుదల చేసిన వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక-2024లో పేర్కొంది.
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో నీటిలో ఫ్లోరైడ్ సాంద్రత అనుమతించదగిన పరిమితిని మించి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 28 జిల్లాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చోట్ల భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భూగర్భ జలాల్లో అధిక ఫ్లోరైడ్ స్థాయిలతో బాధపడుతున్నారు.
స్వీడన్‌కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనం ప్రకారం ఫ్లోరైడ్ ప్రభావంతో పిల్లల్లో తెలివితేటలు మందగిస్తున్నట్లు బయటపడింది. ప్రభుత్వం, ప్రజలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పరిష్కారాలను వెదకాలి. జాగ్రత్తలు పాటించాలి.
- కోడం పవన్‌కుమార్,
సీనియర్ జర్నలిస్ట్