- తుది దశలో సాయిల్ టెస్టింగ్ పనులు
- ఆస్తులు కోల్పోతున్న వారికి టీడీఆర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించాలనుకున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల పనులు మరో నెలలోనే మొదలుకాబోతున్నట్టు సమాచారం. హెచ్ సిటీలో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఓవైపు సాయిల్ టెస్ట్ నిర్వహిస్తుండగా మరోవైపు ఆస్తులు కోల్పోతున్న వారిని ఒప్పించి టీడీఆర్(ట్రాన్స్ ఫరేబుల్ డెవలప్మెంట్ రైట్) ఇప్పించే ప్రాసెస్ ని అధికారులు వేగవంతం చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్10, రోడ్ నంబర్12, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాసాబ్ ట్యాంక్ వైపు వెళ్లే మార్గాల్లో ప్రతిరోజూ తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా ఆఫీస్ టైమ్స్ లో, సాయంత్రం వేళల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి.
ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు పెరుగుతాయని గ్రహించిన ప్రభుత్వం రూ.1090 కోట్లతో 6 ఫ్లై ఓవర్లు, 6 అండర్ పాస్ లు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిగ్నల్ ఫ్రీ కారిడార్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వాహనదారుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నది. ఏడాది క్రితమే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ చేసినప్పటికీ ఆస్తుల సేకరణలో ఇబ్బందులు రావడంతో పనులు షురూ కాలేదు.
దీంతో ప్రాజెక్టులో ఆస్తులు కోల్పోతున్న వారికి టీడీఆర్ ఇస్తామని బల్దియా ఒప్పించడంతో ప్రస్తుతం ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణానికి సంబంధించి సాయిల్ టెస్టింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ స్థితిగతులు, నీటి మట్టం వంటి అంశాలను పరిశీలిస్తూ నివేదికలు రెడీ చేస్తున్నారు. వీటి ఆధారంగా ఫ్లైఓవర్ల డిజైన్, పిల్లర్ల ఎత్తు, నిర్మాణ విధానం ఖరారు చేయనున్నారు.
రెండు రోజుల్లో సాయిల్ టెస్టులు పూర్తి
మరో రెండు రోజుల్లోనే సాయిల్ టెస్టింగ్ పూర్తి కానుందని, ఈ నేపథ్యంలో వచ్చేనెలలో నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలుపెట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ కావడంతో నిర్మాణ పనుల్లో పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తామంటున్నారు. చెట్ల తొలగింపును తగ్గించడం, శబ్ద కాలుష్యం నియంత్రణ, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంతేగాకుండా ఇప్పుడు వస్తున్న వాహనాలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేస్తామంటున్నారు.
తొలగిన భూసేకరణ ఇబ్బందులు
ఫ్లైఓవర్, అండర్ పాస్ ల నిర్మాణంలో కొంతమంది వ్యక్తులతో పాటు వాణిజ్య సంస్థలు కూడా తమ ఆస్తులు కోల్పోతున్నాయి. దీంతో వారికి పరిహారం విధానం గురించి తెలియజేసి ఒప్పిస్తున్నారు. ఒకవేళ నగదు పరిహారం కోరితే అక్కడున్న మార్కెట్ రేట్‌కు రెండు రెట్లు ఎక్కువ ఇవ్వడం, కాదని టీడీఆర్ కోరితే మార్కెట్ రేట్ కు నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. దీంతో ఆస్తుల సేకరణ అంశం సులువయ్యిందని అధికారులు అంటున్నారు.
