- ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుద్ధరణ
- గత సర్కారు చేసింది తక్కువ..
- ప్రచారం ఎక్కువ: భట్టి విక్రమార్క
- ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు, కృష్ణా - గోదావరి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్సే
- ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్,
- ‘మీ టికెట్’ యాప్ ఆవిష్కరణ
- ఆటో చార్జీల సవరణ జీవో విడుదల
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు రూ.52 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో రూ.35 వేల కోట్లతో రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జీల నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీలో వాటర్ వర్క్స్, అండర్ పాస్ లు, ఇతర పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం ప్రజాభవన్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి ఆర్టీసీ- మెట్రో కామన్ పాస్, మీ టికెట్ మొబైల్ యాప్, డిజిటల్ వీక్లీ బస్ పాస్ లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం సవరించిన ఆటో చార్జీల జీవోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్సిటీలో ప్రజా రవాణాను సమూలంగా మార్చేందుకు రూ.38 వేల కోట్లతో 122 కిలోమీటర్ల మేర మెట్రో ఫేజ్-2 పనులను పాతబస్తీ, ఎయిర్‌పోర్టు, పటాన్ చెరు, హయత్ నగర్ మార్గాల్లో విస్తరిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు రూ.30,627 కోట్లతో 362 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు.
ఓఆర్ఆర్-ట్రిపుల్ ఆర్ అనుసంధానానికి 21 రేడియల్ రోడ్లను డిజైన్ చేసి ఇప్పటికే 10 రోడ్ల అలైన్ మెంట్లు ఖరారు చేశామని, రెండు రోడ్ల పనులు మొదలయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ మహానగరాన్ని గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని.. ఇప్పుడు మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతే సరికొత్త ప్రణాళికలతో విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. నాడు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐటీ కారిడార్లకు పునాదులు వేయడంతో పాటు కృష్ణా, గోదావరి, మంజీరా జలాలను సిటీకి తరలించి దాహార్తి తీర్చినట్టు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలతో పాటు బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, డీఆర్‌డీవో, బీడీఎల్, మిథాని, ఐడీపీఎల్ వంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు.
గత పాలకులు చేసింది తక్కువ.. ప్రచారం చేసుకుంది ఎక్కువ అని విమర్శించారు. సిటీ నడిబొడ్డున 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నది తరహాలో ప్రక్షాళన చేయడానికి ఫేజ్-1 పనులు ప్రారంభించామని భట్టి తెలిపారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించి, రాబోయే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోసమే సవరణ: మంత్రి పొన్నం
దాదాపు 12 ఏండ్ల తర్వాత ప్రజలపై భారం పడకుండా, ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఆటో చార్జీలను సవరించామని మంత్రి పొన్నం ప్రభాకర్తెలిపారు. త్వరలోనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. మెట్రో, బస్సు, ఆటో సేవలను అనుసంధానిస్తూ ఫస్ట్ మైల్-లాస్ట్ మైల్ కనెక్టివిటీ కల్పిస్తున్నామని, విజన్-2047 లక్ష్యంగా అన్నింటినీ ఒకే డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి తెస్తామని వివరించారు. ఆర్టీసీకి ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ.300 కోట్లు విడుదల చేస్తోందని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అదనంగా రూ.50 కోట్లు కలిపి నెలకు మొత్తం రూ.350 కోట్లు ఇవ్వాలని వేదికపైనే డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు.
పబ్లిక్ ట్రాన్స్ పోర్టుతో.. ట్రాఫిక్ తగ్గుతుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో అర్బనైజేషన్‌కు అనుగుణంగా ప్రజా రవాణా సర్వీసులను మరింత పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు - ఆర్టీసీ బస్సుల మధ్య మెరుగైన కనెక్టివిటీతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని, ప్రస్తుతం మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే దిశగా చర్యలు అవసరని పేర్కొన్నారు. ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ప్రయాణిస్తే హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన, చౌకైన, సౌకర్యవంతమైన రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీ వరకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం విప్లవాత్మకంగా మెరుగుపరుస్తోందని చెప్పారు.
నేడు మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో డిప్యూటీ సీఎం, మంత్రులు
కామన్ పాస్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శనివారం మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించడంతో పాటు.. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. కామన్ పాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా డబ్బులు చెల్లించి.. సీఎం సహా 15 మంది మంత్రుల కోసం వన్ డే కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర మంత్రులు బేగంపేట మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కామన్ పాస్‌తో జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణిస్తారు. అనంతరం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వరకు వెళ్తారు.
