యూరియా నిల్వలపై దృష్టిపెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు

యూరియా నిల్వలపై దృష్టిపెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు: యూరియా సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలోని కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తుగా యూరియా నిల్వలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ సెక్రటరీకి సూచించారు.

వానా కాలంలో పంట విస్తీర్ణం కోటిన్నర ఎకరాలకు చేరుకునే అవకాశముందని అంచనా వేశారు. జూన్, జులైలో యూరియాకు డిమాండ్ ఉండే నేపథ్యంలో, ఏప్రిల్–మేలోనే కేంద్రం నుంచి యూరియాను తెప్పించి స్టోర్​ చేస్తే సకాలంలో రైతులకు సరఫరా చేయవచ్చన్నారు.

రాష్ట్రానికి కావాల్సిన యూరియా కేటాయించేలా  అగ్రికల్చర్​ అడిషనల్​ డైరెక్టర్లను ఢిల్లీకి పంపించాలని మంత్రి ఆదేశించారు.  యూరియా యాప్​తో దుర్వినియోగం, పక్కదారి మళ్లింపును అరికట్టామని తెలిపారు. కేంద్రం కేటాయించిన యూరియా కోటాను పూర్తిగా పొందేందుకు అధికారులు కృషి చేయాలని, ఏప్రిల్, మే లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

అశ్వరావుపేటలో పర్యటించనున్న కొడంగల్ రైతులు
కొడంగల్ నియోజకవర్గంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని 8 మండలాల నుంచి 92 మంది రైతులను క్షేత్రస్థాయి పరిశీలన కోసం అశ్వరావుపేటకు పంపుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 

నర్మెట్టలో ఇటీవల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం ఇచ్చిన సూచనల మేరకు ఏర్పాట్లు చేశారు. తోటలను సందర్శించడం ద్వారా సాగు విధానాలపై రైతులకు పూర్తి అవగాహన కలుగుతుందన్నారు.  ప్రత్యేక ప్రదర్శనలు, పవర్‌‌పాయింట్ ప్రజెంటేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.