హద్దులు దాటిన అభిమానం...సింగర్పై కరెన్సీ నోట్ల వర్షం

హద్దులు దాటిన అభిమానం...సింగర్పై కరెన్సీ నోట్ల వర్షం

ఒకప్పుడు అభిమానం హద్దులు దాటితే పేపర్లు చింపి విసిరేసేవారు. కానీ ఇప్పుడు కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గుజరాత్లో అభిమానం హద్దులు దాటి..సింగర్పై నోట్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అసలు విషయం ఏంటంటే..?

గుజరాత్‌ వల్సద్ అగ్నివీర్ గో సేవా దళ్ ఫోక్ సింగర్ కీర్తిదన్ గధ్వీతో  ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.  పోడియంపై కూర్చుని హార్మోనియం వాయిస్తూ కీర్తిదన్ పాట పాడుతున్నాడు. ఈ పాటకు ముగ్ధులైన స్థానికులు..  రూ.10, 20,50,100  నోట్ల వర్షం కురిపించారు. ఒక్కొక్కరుగా  ముందుకు వచ్చి నోట్లు చల్లడం ప్రారంభించారు. దీంతో వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. 

ఇదో ట్రెండ్..

గుజరాత్‌ రాష్ట్రంలో ప్రస్తుతం నోట్ల వర్షం  ట్రెండ్‌ అయిపోయింది. జానపద గాయకులు ఎక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించినా...వాళ్లపై ప్రజలు, కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు నోట్ల వర్షం కురిపిస్తారట. అయితే ఇలా వచ్చిన డబ్బుని సామాజిక సేవకు మాత్రమే వినియోగిస్తారట. అగ్నివీర్ గో సేవా దళ్ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడంతో...నోట్ల వర్షం ద్వారా వచ్చిన డబ్బును...అనారోగ్యానికి గురైన ఆవులకు చికిత్స అందించడానికి.. వాటి బాగోగులు చూడటానికి ఉపయోగిస్తారు. గతంలో నవసరి గ్రామంలో కీర్తిదన్‌ కచేరీ ఏర్పాటు చేస్తే..ఆ సమయంలో ఏకంగా రూ.50 లక్షల నోట్ల  వర్షం ఆయనపై కురిపించారు. మరి ప్రస్తుతం ఎన్ని లక్షల వర్షం కురిసిందో లెక్కలు తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సర్పంచ్ పై నోట్ల వర్షం..

అటు గుజరాత్‌ రాష్ట్రంలోని మెషనా జిల్లాలో ఓ మాజీ సర్పంచ్‌ తన ఇంటి డాబాపై నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. మేనల్లుడి పెళ్లి కావడంతో సంతోషంగా ఫీలై... లక్షలు కుమ్మరించాడు. కెర్రీ తహసీల్లోని అగోల్ గ్రామంలో మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ కరీమ్ యాదవ్ బరాత్ నిర్వహించాడు. ఈ క్రమంలోనే ఓ బిల్డింగ్‌పై నిలబడి రూ.500 నోట్లను ప్రజలపై వెదజల్లాడు.  దాదాపు రూ.5 లక్షలకు పైగా నోట్లను విసిరినట్టు తెలుస్తోంది. ఈ నోట్లను పట్టుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు.  ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.