విచ్చలవిడిగా కల్తీ .. కుళ్లిన ఆలుగడ్డల గుజ్జుతో అల్లం పేస్ట్

 విచ్చలవిడిగా కల్తీ .. కుళ్లిన ఆలుగడ్డల గుజ్జుతో అల్లం పేస్ట్
  • పాడైపోయిన పదార్థాలతోనే ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, పచ్చళ్లు
  • గ్రేటర్  వరంగల్  సిటీలో విచ్చలవిడిగా ఆహారం కల్తీ
  • పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు : గ్రేటర్​ వరంగల్​ సిటీలో విచ్చలవిడిగా ఆహార కల్తీ జరుగుతున్నది. కంటికి ఇంపుగా కనిపించేందుకు ఫాస్ట్ ఫుడ్​ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లలో వివిధ రకాల ఫ్లేవర్​ కలర్లు కలుపుతున్నారు. టేస్ట్  కోసం కెమికల్​ సాల్ట్ వేస్తున్నారు. వంటకు ఉపయోగించే అల్లం, కారంపొడి, వివిధ రకాల మసాలాను కూడా కల్తీ చేస్తున్నారు. ఓ వైపు కాలం చెల్లిన ఉత్పత్తులు, మరోవైపు కుళ్లిన పదార్థాలతో తయారు చేస్తున్న ఆహారం జనాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఫుడ్​సేఫ్టీ, మున్సిపల్​ హెల్త్​ ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. అయితే, టాస్క్​ ఫోర్స్​పోలీసులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ  కల్తీ బాగోతాలు బట్టబయలయ్యాయి. 
 

హోటల్  నిర్వాహకుల కక్కుర్తి

గ్రేటర్  వరంగల్  సిటీలో రెండువేలకు పైగా ఫుడ్​స్టాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు వివిధ రకాల వెరైటీలు​తయారు చేస్తున్నాయి. కొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే దురాశతో  కల్తీ అల్లం దందా చేస్తున్నారు. కుళ్లిన ఆలుగడ్డల గుజ్జుతో అల్లం పేస్ట్  తయారు చేస్తున్నారు. కలర్  వచ్చేందుకు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఫార్మాల్డీహైడ్  వంటి కెమికల్స్  కలుపుతున్నారు.ఇలా కల్తీ అల్లం దందా చేస్తున్న మూడు కంపెనీల్లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఇటీవలే సోదాలు చేశారు. సుమారు 20 క్వింటాళ్ల కల్తీ అల్లం సీజ్​ చేశారు. ఈ కల్తీ అల్లం నగరంలోని బడా హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్ల నుంచి గ్రామాల్లో ఉండే కిరాణా షాపులకు కూడా సప్లై అవుతున్నదని పోలీసులు తేల్చారు. ఇవేమీ తెలియని జనాలు కల్తీ పదార్థాలతో తయారైన ఫుడ్​ వెరైటీస్​ తింటూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

బూజు పట్టిన పచ్చళ్లతో బిజినెస్

గ్రేటర్  వరంగల్ సిటీలోని హోటళ్లలో చాలా వరకు ఆహార పదార్థాల్లో నాణ్యత లేదు. ఇటీవల కల్తీ పాల బిజినెస్  చేస్తున్న ఓ డెయిరీలో ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు మూడు, నాలుగు రోజుల పాటు సోదాలు, నోటీసుల పేరున హైడ్రామా నడిచింది. రాజకీయ ప్రలోభాలతో ఆఫీసర్లు కల్తీ పాల వ్యవహారాన్ని లైట్ గా తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొద్ది రోజుల కింద కల్తీ ఐస్​క్రీమ్ లు, పచ్చళ్ల దందా కూడా వెలుగులోకి రావడంతో అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో పచ్చళ్లలోనే ఎలుకలు తిరుగుతుండటం చూసి అందరూ షాక్ అయ్యారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వివిధ షాపులు, కనీస శుభ్రత పాటించకుండానే పచ్చళ్లను స్టోర్​ చేసి అమ్మేస్తున్నారు. బూజు పట్టిన పచ్చళ్లతో బిజినెస్  చేస్తున్నారు. ఫుడ్  సేఫ్టీ స్టాండర్డ్స్​అథారిటీ  ఆఫ్​ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సర్టిఫికెట్​ లేకుండానే కల్తీ బిజినెస్​ జోరుగా నడుస్తున్నది. 

కెమికల్స్ కలిపిన అల్లం పేస్ట్

కెమికల్స్​ కలిపిన అల్లం పేస్ట్ ను వరంగల్ ట్రై సిటీలోని దుకాణాలు, హోటళ్లకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిందితుడిని వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.84 వేల విలువైన ఆరున్నర క్వింటాళ్ల కల్తీ అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండలోని రాంనగర్​ కు చెందిన నాగమల్ల దేవేందర్​ వరంగల్ కరీమాబాద్​ ప్రాంతంలో దత్తప్రియ అల్లం, వెల్లుల్లి ఇండస్ట్రీని నెలకొల్పాడు. సరైన ప్రమాణాలు పాటించకుండా అల్లం పేస్ట్​ను ఎక్కువ కాలం స్టోర్ చేసేందుకు, రంగు కోసం వివిధ రకాల కెమికల్స్​ కలుపుతున్నాడు. కొంతకాలంగా ఈ బిజినెస్​ నడుపుతున్నాడు. కల్తీ అల్లాన్ని వరంగల్ ట్రై సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. కల్తీ అల్లం పేస్ట్  గురించి టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం అతని ఫ్యాక్టరీలో సోదాలు చేసి నాగమల్ల దేవేందర్​ను అరెస్టు చేశారు. కల్తీ సరుకుతో పాటు వివిధ రసాయనాలను స్వాధీనం  చేసుకున్నారు. 

తనిఖీలు మరిచిన ఆఫీసర్లు

నగరంలో ఫుడ్​ బిజినెస్ పై ఎక్కడా కనీస ప్రమాణాలు పాటించడం లేదనే విషయం స్పష్టమవుతున్నది. ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్లతో పాటు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్​ హెల్త్​ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టడం లేదు. ఆహార కల్తీని అరికట్టాల్సిన ఆఫీసర్లు కొందరు మామూళ్లకు అలవాటు పడి తనిఖీలే మరిచారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇకనైనా ఆహారం కల్తీ చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రేటర్  వరంగల్  ప్రజలు కోరుతున్నారు.