యూట్యూబ్ వీడియోలు చూసి స్కూటీ దొంగతనం

యూట్యూబ్ వీడియోలు చూసి స్కూటీ దొంగతనం

ఇద్దరు ఫుడ్ డెలివరీ బాయ్స్‌ ను

పట్టుకున్న కీసర పోలీసులు

ఇద్దరు ఫుడ్ డెలివరీ బాయ్స్ బైక్ లాక్ ఎలా తీయాలో యూట్యూబ్ లో వీడియోలు చూసి స్కూటీ దొంగతనం చేశారు. కానీ పోలీసుల తనిఖీల్లో వీరు దొరికిపోయారు. ఈ ఘటన కీసర పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..కీసరలో ని దమ్మాయిగూడకు చెందిన కన్నబోయిన నవీన్(25), ఘట్ కేసర్ కు చెందిన దత్రిక సాయి కుమార్(28) ఇద్దరూ స్విగ్గిలో ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారు. వీరిలో ఒకరికి బైక్ లేదు. దీంతో నవీన్, సాయికుమార్ పార్కింగ్ లో ఉన్న  బైక్ ను దొంగతనం చేయాలని స్కెచ్ వేశారు. యూట్యూబ్ లో స్కూటీ లాక్ ఎలా బ్రేక్ చేయాలో వీడియోలు చూశారు. గురువారం జవహర్ నగర్ కి శాగంటి పవన్(20) అనే వ్యక్తి రాంపల్లి చౌరస్తాలో స్నేహ చికెన్ సెంటర్ వద్ద  పార్కింగ్ లో తన స్కూటీని ఉంచాడు. ఆ రోజు అర్ధరాత్రి నవీన్, సాయికుమార్ ఇద్దరూ ఆ స్కూటీని ఎత్తుకెళ్లారు.

తన స్కూటీ కనిపించకపోయేసరికి శుక్రవారం ఉదయం పవన్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. మరోవైపు శుక్రవారం ఉదయం కీసర పోలీసులు వెహికల్ చెకింగ్ చేపట్టారు. రాంపల్లి మీదుగా నాగారం వైపు వస్తున్న వెహికల్స్ ను పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ స్కూటీని నెట్టుకుంటూ వస్తున్న నవీన్, సాయికుమార్ ను గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బైక్ పేపర్లు చూపించమని అడిగారు. దీంతో వీరిద్దరూ స్కూటీని అక్కడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయగా..పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. ఆ స్కూటీని గురువారం అర్ధరాత్రి చోరీ చేసిటన్లు నవీన్, సాయికుమార్ విచారణలో ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. వారి దగ్గరి నుంచి స్కూటీని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ నరేందర్ గౌడ్ చెప్పారు.