బీజింగ్: చైనా గ్రేట్ వాల్ ఎక్కే పర్యాటకులకు ఆ దేశ ఫుడ్ డెలివరీ సంస్థ మీతువాన్ డ్రోన్ల సాయంతో ఫుడ్ డెలివరీ చేయనుంది. బీజింగ్ శివార్లలోని గ్రేట్ వాల్ ప్రాంతంలో పర్యాటకులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆహారంతో పాటు డ్రింక్స్, మందులను కూడా డ్రోన్లతో డెలివరీ చేయనుంది. ‘‘బాడాలింగ్కు దక్షిణాన ఒక హోటల్ నుంచి వాచ్ టవర్ వరకు డ్రోన్ డెలివరీ సర్వీసు అందిస్తాం.
పర్యాటకులకు కేవలం ఐదు నిమిషాల్లోనే వారికి కావాల్సిన ఆహారం, మందులను డ్రోన్లతో అందిస్తాం. సాధారణంగా ఈ ప్రాంతంలో పర్యాటకులకు నడిచి సరుకులు అందించాలంటే 50 నిమిషాలు పడుతుంది” అని మీతువాన్ డ్రోన్ బిజినెస్ డైరెక్టర్ యాన్ యాన్ తెలిపారు. చైనా రాజధాని బీజింగ్ లో ఇదే మొట్టమొదటి డ్రోన్ సర్వీస్. ప్రస్తుతం చైనాలో డ్రోన్ డెలివరీ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల కస్టమర్లకు అవసరమయ్యే వస్తువులను డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.