ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్... 180 మంది స్టూడెంట్స్కు తీవ్ర అస్వస్థత

ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్...  180 మంది స్టూడెంట్స్కు తీవ్ర అస్వస్థత

అమ్రాబాద్, వెలుగు :  నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయి 180 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత 30 మంది ఊపిరాడడం లేదని కిందపడిపోయారు. దీంతో సిబ్బంది స్థానిక పీహెచ్​సీకి తరలించారు. తర్వాత 108లో వారిని అచ్చంపేట జనరల్ హాస్పిటల్​కు తీసుకువెళ్లారు. తర్వాత హాస్టల్ లో విద్యార్థులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవడంతో 108 అంబులెన్స్​, ఆటోలు, లారీల్లో 150 మందిని అచ్చంపేటకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూల్ హాస్పిటల్​కు తీసుకువెళ్లారు. 

ఎస్ఎఫ్ఐ, బీజేవైఎం, ఎన్ఎస్​యూఐ విద్యార్థి సంఘాల లీడర్లు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. డీసీపీ డా.వంశీకృష్ణ దవాఖానకు వచ్చి స్టూడెంట్స్​ను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడారు. దవాఖానకు వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితి చూసి కంటతడి పెట్టారు. హాస్టల్​లో 470 మంది ఉండగా మిగిలిన పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఇండ్లకు తీసుకువెళ్లారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కలుషిత నీళ్లు తాగి మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నా వార్డెన్ పట్టించుకోలేదన్నారు. ముందే స్పందిసస్తే  ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.  

మిర్యాలగూడ గిరిజన హాస్టల్​లోనూ...

మిర్యాలగూడ : మిర్యాలగూడలోని ట్రైబల్ గర్ల్స్ హాస్టల్​లో ఫుడ్​ పాయిజన్​ కావడంతో స్టూడెంట్స్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తహసీల్దార్ ఆఫీస్ సమీపంలోని గిరిజన హాస్టల్ లో పది రోజుల నుంచి మెనూ పాటించడం లేదని, రోజూ పప్పు, సాంబార్​అన్నం పెడుతుండడంతో గురువారం సంధ్య, హాసిక అనే విద్యార్థులు ఆయాసంతో మిర్యాలగూడ  ఏరియా దవాఖానకు వెళ్లి మెడిసిన్ తెచ్చుకున్నారు. సాయంత్రం అనూష, రమావత్ ​చిట్టీ, సానియా, సింధు అనే స్టూడెంట్లు ఆయాసం, ఛాతినొప్పితో ఇబ్బంది పడగా వార్డెన్ ​అహల్య అటెండర్​ను ఇచ్చి ఏరియా దవాఖానకు పంపించింది. అక్కడ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు డాక్టర్స్ కాలనీలోని మల్టీ స్పెషాలిటీ దవాఖానకు వెళ్లారు.