V6 News

హైదరాబాద్ సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం.. ఒకే రోజు వ్యవధిలో రెండు స్కూళ్లలో ఘటనలు

హైదరాబాద్ సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం.. ఒకే రోజు వ్యవధిలో రెండు స్కూళ్లలో ఘటనలు
  • 67 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత
  •     వాంతులు , విరేచనాలు, కడుపునొప్పితో విలవిల

మాదాపూర్, వెలుగు: ఒకేరోజు వ్యవధిలో రెండు వేర్వేరు పాఠశాలల్లో ఫుడ్​పాయిజన్ జరగడం సిటీలో కలకలం రేపింది. మాదాపూర్ చంద్రనాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో 44 మంది, బాగ్​లింగంపల్లిలోని మైనార్టీ గురుకులంలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్​చంద్రనాయక్​ తండాలోని ప్రాథమిక పాఠశాలలో 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. 

వీరికి శుక్రవారం ఉదయం టిఫిన్​లో బోండా, మ్యాగీ.. మధ్యాహ్నం అన్నం, పప్పు, పాయసం వడ్డించారు. భోజనం చేసిన తర్వాత 3 గంటల సమయంలో క్లాస్​రూముల్లో దాదాపు 44 మంది విద్యార్థులు కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. దీంతో టీచర్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, అస్వస్థతకు గురైన 44 మందిని అంబులెన్సుల్లో కొండాపూర్​జిల్లా హాస్పిటల్​కు తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో నానక్​రాంగూడలోని రెయిన్​బోకు తరలించి చికిత్స అందించారు. 

ప్రస్తుతం వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్​చేసినట్లు జిల్లా హాస్పిటల్ పిల్లల డాక్టర్లు డా. మహేశ్​కుమార్, డా. గాయత్రి తెలిపారు. అంతకుముందు బాధిత విద్యార్థులను కొండాపూర్ హాస్పిటల్లో డీఈఓ సుశీంధర్​రావు, డీఎంహెచ్​ఓ డా. లలితాదేవి, శేరిలింగంపల్లి ఎమ్మార్వో వెంకారెడ్డి, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​ బాలరాజ్ పరామర్శించారు. అయితే, మధ్యాహ్న భోజనంలో వడ్డించిన పాయసం లేదా ఉదయం టిఫిన్ వల్లే ఇదంతా జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతుండగా, అధికారులు విచారణ చేస్తున్నారు.
 

మైనార్టీ గురుకులంలో 23 మందికి ..

బషీర్​బాగ్: బాగ్​లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పప్పు, -పెరుగుతో కలిపి అన్నం తిన్న 5 నుంచి 9వ తరగతి వరకు 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్న వారిని కింగ్ కోఠి, నిలోఫర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం కింగ్ కోఠి ఆసుపత్రిలో 16 మంది, నిలోఫర్​లో 7 మంది చికిత్స పొందుతున్నారు. 

డిహైడ్రేషన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని రెండు ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తెలిపారు. రెండు మూడ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. కింగ్ కోఠి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ ముకుంద రెడ్డి పరామర్శించారు. 

విద్యార్థుల హెల్త్ కండిషన్ ను డాక్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు. కలుషిత ఆహారం తినడం వల్ల పిల్లలు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్స్ అనుమానిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పిల్లలందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కలుషిత ఆహారం ఘటనపై ఎంక్వైరీ ఆఫీసర్ ను నియమించామని, ఆఫీసర్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.