- గత 9 నెలల్లో 34 వేలకు పైగా అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ బాధితులు..
- రోజుకు సగటున 125 మంది ఆస్పత్రులపాలు
- కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతే కారణమంటున్న డాక్టర్లు
- బయటి ఫుడ్ తగ్గించాలని, క్లీన్‌నెస్ పాటించాలని సూచన
- హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్‌పై నామ్కేవాస్తేగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. కలుషిత ఆహారం తిని జనం ఆస్పత్రులపాలవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, కలరా తదితర లక్షణాలతో హాస్పిటళ్లకు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 34,245 ఫుడ్ పాయిజనింగ్ (అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్) కేసులు నమోదయ్యాయి.
అంటే సగటున ప్రతిరోజూ 125 మంది, నెలకు 3,805 మంది దీని బారినపడుతున్నారు. కలుషిత ఆహారం, నీటి కారణంగా ప్రబలుతున్న ఈ మహమ్మారి.. అన్ని వయసుల వారిని దవాఖాన్ల పాలు చేస్తున్నది. ఈ విషయం ఇటీవల వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల్లో బయటపడింది.
10 జిల్లాల్లో పెరిగిన కేసులు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 జిల్లాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగాయి. నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే కేసుల సంఖ్య ఎక్కువైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 2,770 కేసులు నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 3,681కి చేరింది. అంటే 911 కేసులు పెరిగాయి. ఆ తర్వాత వనపర్తిలో 289, సిద్దిపేటలో 89 కేసులు గతేడాదితో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ జిల్లాల్లోని ప్రజలు కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్లే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
కలుషిత ఆహారంతోనే..
కలుషితమైన నీరు తాగడం, ఆహారం తీసుకోవడం వల్లే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ పెరుగుతున్నదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో తాగునీటి పైపులైన్లలో లీకేజీ ఏర్పడి నీళ్లు కలుషితం కావడం, ఆ నీళ్లను నేరుగా తాగడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ క్వాలిటీని అధికారులు గాలికొదిలేశారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
వారి తనిఖీలు కేవలం మొక్కుబడిగా ఉంటున్నాయని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించి బయట మంచి, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే సరైన పర్యవేక్షణ లేని కారణంగా హాస్టళ్లు, స్కూళ్లలో కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బయటి ఫుడ్, స్కూళ్లు, హాస్టల్ ఫుడ్ విషయంలో అధికారులు, ఇంట్లో వండుకునే తిండి విషయంలో ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తేనే కలుషితానికి కళ్లెం వెయ్యొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శుభ్రతే ముఖ్యం..
అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. తప్పనిసరిగా కాచి, చల్లార్చిన నీటిని, ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. వీలైనంత వరకు బయటి ఫుడ్డుకు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. భోజనానికి ముందు, మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
లక్షణాలు కనిపిస్తే అన్నం, గంజిలో ఉప్పు కలుపుకొని తినాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆకస్మికంగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు వెళ్లి చూపించుకోవాలి. ఓఆర్‌ఎస్ లిక్విడ్ కాకుండా పౌడర్‌ను వేడి చేసి చల్లార్చిన నీళ్లలో కలుపుకొని తాగాలి. దీన్ని తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకోవచ్చు.
చల్లారిన ఆహారాన్ని వేడి చెయ్యొద్దు..
చల్లారిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల బేసిలస్ సెరియస్ వంటి బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది. బయట రెస్టారెంట్లలో ఆహారాన్ని పదే పదే వేడి చేస్తారు. దీంతో బేసిలస్ సెరియస్ వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కలుషిత నీరు కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి వాటర్ తీసుకెళ్లాలి.
– డాక్టర్ రాజారావు, ప్రిన్సిపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్-
ఇంట్లో వండిన ఆహారమే తినాలి..
ప్రస్తుతం బయట రెస్టారెంట్లు, హోటళ్లలో తినడమే ప్యాషన్‌గా, ఇంట్లో వంట చేయడాన్ని నామోషీగా ఫీల్ అవుతున్నారు. బయట కుళ్లిన పదార్థాలు, రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లలో నిల్వ ఉంచిన పదార్థాలతో ఫుడ్ తయారు చేస్తారు. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి, వాంతులు, లూజ్ మోషన్స్, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం వల్ల పాలి హైడ్రో కార్బన్స్ తయారవుతాయి. ఇది క్యాన్సర్ కు దారి తీస్తుంది. శుభ్రమైన వాతావరణలో ఇంట్లోనే వండుకుని తినాలి. ఏ అనారోగ్య సమస్య దరిచేరదు.
- డాక్టర్ శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్, సూర్యాపేట-
