సామాన్యుడి జేబుకు మరోసారి చిల్లు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న దేశ ప్రజలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నవంబర్ మంత్లీ ఎకనామిక్ రివ్యూ మరో షాకింగ్ వార్తను అందించింది. రాబోయే రోజుల్లో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువుల ధరలు మళ్లీ భగ్గుమనే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.
అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 8.94 శాతానికి ఎగబాకి సామాన్యులకు చుక్కలు చూపించింది. దీనికి తోడు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మార్కెట్లో వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మరోవైపు వాతావరణ మార్పులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడాది చివరి నాటికి 'ఎల్నినో' ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించడం పంటల దిగుబడి, ఆహార ధరలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.
అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హార్ముజ్ జలసంధి గుండా జరిగే సరుకు రవాణాపై ఉన్న ముప్పు కూడా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. అయితే ఈ కష్టకాలంలోనూ కాస్త ఊరటనిచ్చే అంశాలు లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల దిగువకు రావడం, రూపాయి విలువ బలపడటం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు అదుపులో ఉండే ఛాన్స్ ఉంది. అలాగే పాజిటివ్ జోన్లో ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ కొనసాగితే ఎల్నినో తీవ్రత కొంతమేర తగ్గవచ్చు.
మొత్తానికి రాబోయే కొన్ని నెలల పాటు ఆహార ధరలు, వాతావరణ పరిస్థితులు, పండుగ డిమాండ్ దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించనున్నాయి. సవాళ్లు ఎన్ని ఎదురైనా.. మన దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునే సామర్థ్యం భారత్కు ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.
