పేరుకే స్టార్ హోటళ్లు.. ఈ ఫుడ్ తింటే..హాస్పిటల్​ కే

పేరుకే స్టార్ హోటళ్లు.. ఈ ఫుడ్  తింటే..హాస్పిటల్​ కే
 
  • ఎక్స్ పైరీ అయిన మసాలాలు, పాడైన  కూరగాయలు, కల్తీ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్
  • రోజుల‌‌‌‌ తరబడి నిల్వ చేసిన మాంసంతో  వంటకాలు 
  • కరీంనగర్ ‌‌‌‌హోటళ్లు, రెస్టారెంట్లపై రెండో రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల రైడ్స్ 
  • దాడుల వివరాలను గోప్యంగా ఉంచడంపై అనుమానాలు

కరీంనగర్, వెలుగు : ఎత్తయిన భవనాలు, సూట్, డీలక్స్ రూమ్ లు, ఖరీదైన మెనూ..  స్టార్ హోటళ్లు అని పేరుకే. కిచెన్ లోకి వెళ్తే అక్కడి గలీజ్ వాతావరణం చూసి వాంతి చేసుకోవాల్సిందే. ఎక్స్ పైరీ అయిన మసాలాలు, కల్తీ ఆయిల్, నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్, మోతాదుకు మించి ఫుడ్ కలర్స్, పాడైన కూరగాయలు, రోజుల తరబడి నిల్వ చేసిన చికెన్, మటన్ తో వంటలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో హోటల్ యజమానులు ఆటలాడుకుంటున్నారు. 

స్టార్ హోటళ్లతోపాటు కరీంనగర్ లో పేరు మోసిన మిగతా హోటళ్లు, రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఇన్నాళ్లు మామూళ్లకు అలవాటుపడి మొద్దు నిద్రబోయిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎట్టకేలకు డ్యూటీ చేయడం మొదలుపెట్టారు. దీంతో హోటల్ నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

రెండో రోజు కొనసాగిన దాడులు.. 

రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగా కరీంనగర్ లో ఆదివారం శ్వేత, ప్రతిమ, విందుభోజనం హోటళ్లలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బస్టాండ్ పక్కన ఉన్న ఓ హోటల్ లో కాలం చెల్లిన మసాలాలు, సాస్ లు, కుళ్లిన కోడిగుడ్లు, కల్తీ నూనెను వినియోగిస్తున్నారని తేలింది. డీప్ ఫ్రిజ్ ల్లో పాలక్ పన్నీరు, అపోలో ఫిష్, ప్రాన్స్, కలర్, మసాలా పట్టించిన చికెన్, మటన్, కట్ మిర్చి, ఉడుకబెట్టిన అన్నం నిల్వ చేసినట్లు దాడుల్లో వెలుగు చూసింది. శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపారు. 

సోమవారం రెండో రోజు కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కరీంనగర్ లో దాడులు కొనసాగాయి. కమాన్ సమీపంలోని పికాక్ ప్రైడ్, కోర్టు చౌరాస్తాలోని కృతింగ, సర్కస్ గ్రౌండ్ సమీపంలోని మైత్రి రెసిడెన్సీ పై రైడ్స్ చేశారు. ఈ సందర్భంగా కృతింగ హోటల్ లో గసగసాలు, మూంగ్ దాల్, జీరా, మసాలా పొడులు, నూడిల్స్, కారం, పచ్చి బఠానీలు గడువు తీరినవిగా గుర్తించారు. 

ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ సర్టిఫికెట్లు లేవని, స్టోర్ రూమ్ లోకి వెలుతురు రావడం లేదని, సీలింగ్ వైట్ కోటింగ్ అవసరమని గుర్తించారు. అలాగే మైత్రీ రెసిడెన్సీలో అనారోగ్యానికి గురి చేసేలా ఉన్నట్లు అనుమానిస్తున్న ఫుడ్ శాంపిల్స్ తీసుకున్నారు. 10 కేజీల గోధుమ పిండిని నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబోరేటరీకి పంపించారు. పికాక్ ప్రైడ్ హోటల్ లో వర్కర్స్ కు మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడం, ఫుడ్ ఐటెమ్స్ ను ప్యాక్ చేసే ప్యాకింగ్ మెటీరియల్ కోసం సపరేట్ స్టోరేజీ లేకపోవడం గుర్తించారు. 

అప్రమత్తమైన హోటళ్ల నిర్వాహకులు.. 

కరీంనగర్ లోని పలు ప్రముఖ హోటళ్లు సిండికేట్ పద్ధతిలో నడుస్తున్నాయి. కొందరు గ్రూపుగా ఏర్పడి హోటళ్లను లీజ్ కు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఆదివారం దాడులు మొదలు కావడంతో కొన్ని హోటళ్లను మూసివేసినట్లు తెలిసింది.  మరోవైపు దాడుల సమాచారం మీడియాకు ఇవ్వకపోవడం, గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సోమవారం నిర్వహించిన దాడుల వివరాలను సాయంత్రం అధికారికంగా వెల్లడించినప్పటికీ ఆదివారం దాడుల సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. శ్వేత, ప్రతిమలాంటి స్టార్ హోటళ్లకు సంబంధించిన వ్యవహారం కావడంతోనే వివరాలు చెప్పేందుకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సుముఖంగా లేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.