- పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో మండలస్థాయి వరకు ‘హై పవర్’ టీమ్స్
- మహిళా సంఘాలను ఫుడ్ వలంటీర్లుగా తీసుకోవడంపైనా కసరత్తు
- రాష్ట్ర స్థాయిలో ‘ఈగల్’ తరహాలో ‘ఫుడ్ సేఫ్టీ వింగ్’
- సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే యోచనలో ప్రభుత్వం
- కల్తీ నేరగాళ్లకు ఇక జీవిత ఖైదే!
- అధికారులకు సెర్చ్ అండ్ సీజ్ పవర్స్ ఇచ్చేలా చట్టంలో మార్పులు
- టెస్టింగ్ ల్యాబ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల పెంపుపై ఫోకస్
- మధ్యప్రదేశ్, యూపీ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కల్తీ కట్టడి తీరుపై స్టడీ
హైదరాబాద్, వెలుగు: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్ల ఆటకట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆహార కల్తీని మూలాలను పెకిలించి వేసేందుకు ఈగల్ తరహా ‘స్పెషల్ ఫోర్స్’ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక విభాగానికి సారథ్యం వహించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించేలా కసరత్తు చేస్తున్నది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా.. కల్తీ నెట్‌వర్క్‌ను పాతాళానికి తొక్కేలా మండలస్థాయి వరకు ఈ వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. కల్తీని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్న ప్రభుత్వం, కల్తీ నేరగాళ్లకు చుక్కలు చూపించేలా చట్టాల్లో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నది. కేవలం పీడీ యాక్ట్లాంటివే కాకుండా జీవిత ఖైదులాంటి కఠిన శిక్షలు అమలు చేయాలని చూస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న చట్టంలో తీసుకురావాల్సిన మార్పులను పరిశీలించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, కల్తీ మాఫియా వెన్నులో వణుకు పుట్టించడమే లక్ష్యంగా ఈ కొత్త వింగ్ రూపుదిద్దుకుంటున్నది. కేవలం అధికారుల పర్యవేక్షణే కాకుండా, గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీల్లో మహిళా సంఘాలను ‘ఫుడ్ వలంటీర్లు’గా భాగస్వామ్యం చేసి.. వారికి ప్రాథమిక పరీక్షా కిట్లను అందించే దానిపైనా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. గల్లీలోని కిరాణా షాపు నుంచి మల్టీ నేషనల్ బ్రాండ్ల వరకు ఎక్కడా రాజీ లేకుండా తనిఖీలు చేస్తూ కల్తీ నెట్‌వర్క్ ను తుడిచిపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.
పోలీస్, రెవెన్యూ విభాగాల సమన్వయంతో..
ఆహార భద్రత విభాగం కేవలం నామమాత్రపు తనిఖీలకు పరిమితం కాకుండా, పూర్తిస్థాయి దాడులు నిర్వహించేలా ఈ ‘స్పెషల్ ఫోర్స్’ను తీర్చిదిద్దనున్నారు. ఇందులో కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే కాకుండా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల అధికారులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఒక పటిష్టమైన యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కల్తీకి పాల్పడే మిల్లులు, గోడౌన్లు, తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు ఈ బృందాలకు పూర్తి అధికారాలు ఇవ్వనున్నారు. కేవలం జరిమానాలతో వదిలిపెట్టే సంస్కృతికి స్వస్తి పలికి, అక్రమార్కుల ఆస్తులను జప్తు చేసేలా, వారి లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయడమే కాకుండా కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి మండలానికి ఒక పర్యవేక్షణ బృందం ఉండటం వల్ల కల్తీ నెట్‌వర్క్ ఎక్కడ మొదలైనా వెంటనే పసిగట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సాగే ప్రతి తనిఖీని రియల్ టైమ్‌లో మానిటర్ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కనీసం 3 మొబైల్ ల్యాబ్‌లను కేటాయించి, సామాన్య ప్రజలు సైతం తాము కొన్న వస్తువులను నామమాత్రపు ఫీజుతో అక్కడికక్కడే పరీక్షించుకునే వెసులుబాటు కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. పోలీసులు ఉపయోగించే ‘డయల్ 100’ తరహాలో ఆహార కల్తీ ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ యాప్ లేదా హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రవేశపెట్టి, ఫిర్యాదు అందిన గంటలోనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలా ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ను సిద్ధం చేయనున్నారు.
చట్టానికి పదును..
ప్రస్తుతం అమల్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం శిక్షలు చాలా తక్కువగా ఉండటం, జరిమానాలతో నిందితులు బయటపడటం కల్తీ పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర చట్టంలోని లొసుగులను అధిగమిస్తూ, రాష్ట్ర పరిధిలో కఠినమైన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టుగా.. కల్తీకి పాల్పడితే ‘జీవిత ఖైదు’ విధించేలా నిబంధనలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా స్టేట్ అమెండ్‌మెంట్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. అధికారులకు కేవలం శాంపిల్స్ సేకరించే అధికారం మాత్రమే కాకుండా, నేరుగా సెర్చ్ అండ్ సీజ్ చేసే పవర్స్ కల్పించడం ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల ద్వారా కల్తీ చేయాలంటేనే భయం కలిగేలా చట్టాన్ని మార్చబోతున్నారు. ఇక మౌలిక సదుపాయాల బలోపేతం.. కల్తీని అరికట్టడంలో వేగవంతమైన ఫలితాల కోసం కేవలం చట్టాలే కాకుండా మౌలిక సదుపాయాల పెంపుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు ప్రతి జిల్లాలో అధునాతన ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనివల్ల నమూనాలను పరీక్షించిన వెంటనే ఫలితాలు వచ్చేలా చేసి, నేరస్తులపై సత్వర చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కల్తీ నివారణకు ‘ఆపరేషన్ మిల్క్’, ‘శుద్ధ్ కే లియే యుద్ధ్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. అక్కడ అధునాతన మొబైల్ టెస్టింగ్ నిరంతరం మార్కెట్లలో తిరుగుతూ నిమిషాల వ్యవధిలోనే ప్రాథమిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. యూపీ లో కల్తీ మాఫియాపై అవసరమైతే ‘గ్యాంగ్‌స్టర్ యాక్ట్’ ప్రయోగించి ఆస్తుల జప్తు వరకు వెళ్తుండ గా, పశ్చిమ బెంగాల్‌లో నాణ్యతా ప్రమాణాల తనిఖీ కోసం ప్రతి జిల్లాలో ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ రాష్ట్రాల్లో టెస్టింగ్ కెపాసిటీని ఏటా లక్షకు పైగా నమూనాలు పరీక్షించే స్థాయికి పెంచడమే కాకుండా, రిపోర్టులు వచ్చే సమయాన్ని తగ్గించారు. ఒడిశాలో కల్తీ జరిగిన వెంటనే ఆన్‌లైన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా రిపోర్ట్‌లు జనరేట్ చేసి, 24 గంటల్లోనే షోకాజ్ నోటీసులు ఇచ్చేలా డిజిటల్ వ్యవస్థను పటిష్టం చేశారు. కేవలం నమూనాలు సేకరించడమే కాకుండా, ఫలితాలు వచ్చిన వెంటనే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి నిందితులకు జీవిత ఖైదు పడేలా ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేశారు. కేరళలాంటి రాష్ట్రాల్లో ‘సేఫ్ కేరళ’ ప్రాజెక్టు ద్వారా ప్రతి హోటల్‌కు హైజీన్ రేటింగ్ ఇవ్వడం, నిబంధనలు పాటించని వారి వివరాలను బహిరంగంగా సోషల్ మీడియాలో ఉంచడం ద్వారా వ్యాపారుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతున్నారు.
