గ్రేటర్​లో కల్తీ ఫుడ్ ఐటమ్స్ దందా

గ్రేటర్​లో కల్తీ ఫుడ్ ఐటమ్స్ దందా

జీడిమెట్ల, వెలుగు: సమ్మర్ కదా అని మీ పిల్లలను ఐస్ క్రీంలు కొనిస్తూ, మీరూ తింటున్నారా? ప్యాకింగ్ బాగుందని నెయ్యి, కొబ్బరి నూనెలు కొంటున్నారా? అయితే వాటిని వెయ్యి కండ్లతో పరిశీలించిన తర్వాతే కొనండి. లేదంటే మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. గ్రేటర్ లో ఐస్ క్రీమ్ మొదలుకొని పాలు, నెయ్యి, కొబ్బరి నూనె, జండూబామ్, నూడుల్స్, టమోటో సాస్ , పచ్చళ్లు ఇలా ప్రతీ దానికి నకిలీ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా వాటిని మార్కెట్​లోని షాప్​ లకు సప్లయ్  చేస్తున్నారు. దుకాణాదారులు వాటిని జనాలకు అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. అధికారుల దాడుల్లో అప్పుడప్పుడు కల్తీ, పర్మిషన్ లేని తయారీ కేంద్రాలు  బయటపడుతున్నాయి.

శివార్లలోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో

సిటీ శివారు పారిశ్రామివాడలైన జీడిమెట్ల, ఎస్వీ కో ఆపరేటివ్​సొసైటీ, బాలానగర్, కాటేదాన్ తో పాటు వాటిని ఆనుకుని ఉన్న పలు కాలనీల్లో నకిలీ తయారీ కేంద్రాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. వాటిల్లో విచ్చలవిడిగా నకిలీ, కల్తీ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు.  నెలల తరబడి నిల్వచేసిన పదార్థాలు, ప్రమాదకర కెమికల్స్​తో ఐస్ క్రీంలు, చాక్లెట్స్, నూడుల్స్, సాస్​లు ఇలా అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ ను తయారు చేస్తున్నారు. ఫ్యాన్లు, ప్రముఖ కంపెనీల పరికరాలు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల అక్షరం తేడాతో నకిలీ ప్రొడక్ట్స్ ను తయారు చేస్తుండగా మరికొన్ని చోట్ల అచ్చుగుద్దినట్లు ఒరిజినల్​వాటిలాగే నకిలీవి కూడా ఉంటున్నాయి.  దీంతో  ఒరిజినల్​అనుకొని జనాలు వాటిని కొంటున్నారు.దీంతో జేబులు గుల్ల చేసుకుంటూ ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటళ్ల పాలవుతున్నారు.

సీరియస్ గా ఫోకస్ చేయట్లే..

జీడిమెట్ల, కాటేదాన్  తదితర ప్రాంతాల్లో ఎన్నో  తయారీ కేంద్రాల్లో కల్తీ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తుండగా.. మరికొన్ని అసలు పర్మిషన్ లేకుండానే నడుస్తున్నాయి. కల్తీ వ్యాపారం జోరుగా సాగిస్తూ నిర్వాహకులు రూ. కోట్లు వెనుకేసుకుంటున్నారు. అయితే, వాటిపై బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్​గా దృష్టిపెట్టడం లేదు. కంప్లయింట్లు వచ్చినపుడు మాత్రమే అధికారులు దాడులు చేసి, ఆపై పట్టించుకోకపోవడంతో నకిలీల తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. దాడులు జరిగిన సమయంలో కుళ్లిపోయిన పచ్చళ్లు, వాసనలతో కూడిన ఐస్ క్రీమ్ లు, నెయ్యి, అపరిశుభ్రత వాతావరణంలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ, ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు బయటపడుతోంది. నిరంతరం నిఘా ఏర్పాటు చేసి కల్తీ తయారీ కేంద్రాలను అధికారులు అడ్డుకుని ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాలని జనం కోరుతున్నారు. 

ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎస్​వోటీ పోలీసుల దాడులు ..

కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 24 కంపెనీల్లో  బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. బిస్కెట్లు తయారీలో కలర్ల వాడకం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పల్లిపట్టీ, చాక్లెట్లను కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు.  17 కంపెనీలకు నోటీసులు ఇచ్చారు.  చందానగర్​లో ఓ గోడౌన్ పై దాడి చేసి రూ. 10 లక్షల విలువైన నకిలీ ప్రొడక్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.   దూలపల్లి రోడ్ లోని ఓ కేంద్రంపై దాడి చేసి రూ.8 లక్షల విలువ చేసే ఐస్ క్రీమ్ లు, తయారీ మెషీన్లను  స్వాధీనం చేసుకున్నారు. 
కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్–2లో పర్మిషన్ లేని ఐస్ క్రీమ్ యూనిట్​పై దాడి చేసి కేసు నమోదు చేశారు. అత్తాపూర్​లో కల్తీ లాలీపాప్​లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.  కూకట్​పల్లి, కేపీహెచ్​బీలో నకిలీ కెంట్, ఆక్వా ఫ్యూరిఫైర్ పరికరాలు అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.  జీడిమెట్లలో కుళ్లిన పచ్చళ్లు తయారు చేస్తుండగా అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.  సుభాష్​నగర్​లో కల్తీ నూడుల్స్ తయారు చేస్తుండగా పట్టుకుని జరిమానా విధించారు. 
 సూరారంలో కల్తీ టమాట సాస్ తయారు చేస్తుండగా పట్టుకున్నారు.

తినే ఫుడ్ కల్తీ అయితే ఎట్లా?

ఫుడ్ ఐటమ్స్ ను కల్తీ చేసేవారిని శిక్షించాలి. అప్పుడే ఇతర తయారీ దారులు భయపడతారు. కల్తీ కేంద్రాలపై నిరంతరం నిఘా పెట్టి నిందితులపై చర్యలు తీసుకుంటే గానీ పరిస్థితుల్లో మార్పు రాదు.
 – గిరిబాబు, జీడిమెట్ల

ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ దాడులు

పరిగి:  వికారాబాద్, పరిగి, తాండూరు పట్టణాల్లోని పలు ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఐస్ క్రీమ్ తయారీలో ప్రమాదకర కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు.  వికారాబాద్ పట్టణంలోని మణికంఠ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలో ప్రమాదకర కెమికల్స్‌, కలర్లు, ఫ్లేవర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నెపల్లిలోని ఏకే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీతో పాటు పరిగిలోని మహా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి ఎలాంటి పర్మిషన్ లేదని టాస్క్ ఫోర్స్ టీమ్ గుర్తించింది. దీంతో పాటు అక్కడ కెమికల్స్, కలర్లు వాడుతున్నట్లు తేలిందని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ దాడుల్లో రూ.29 లక్షల విలువైన కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు.