ఏసీ వేసుకుని డాక్టర్ మెుద్దు నిద్ర.. ఆసుపత్రిలో యాక్సిడెంట్ బాధితుడు మృతి

ఏసీ వేసుకుని డాక్టర్ మెుద్దు నిద్ర.. ఆసుపత్రిలో యాక్సిడెంట్ బాధితుడు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో లాలా లజపతి రాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి సరైన సమయంలో వైద్యం అందక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. అయితే డాక్టర్లు డ్యూటీలో ఉంటూ నిద్రపోతుండటం సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరు జూనియర్ డాక్టర్లను సస్పెండ్ చేశారు.

వివరాలు చేస్తే నిన్న సోమవారం సాయంత్రం సునీల్ అనే వ్యక్తిని రోడ్డు ప్రమాదం కారణంగా పోలీసులు LLRM మెడికల్ కాలేజీకి తీసుకువచ్చారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో చేర్చే సమయంలో అతను తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్నాడు.

సునీల్ కుటుంబ సభ్యులు ఆరోపించిన దాని ప్రకారం, సునీల్ స్ట్రెచర్‌పై చాలాసేపు నొప్పితో, రక్తస్రావంతో బాధపడుతూ అరుస్తుండగా  డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లు భూపేశ్ కుమార్ రాయ్, అనికేత్ నిద్రపోతున్నారని తెలిపారు. వైరల్ అయిన వీడియోలో ఒక డాక్టర్ ఏసీ ముందు టేబుల్‌పై కాలు పెట్టి  నిద్ర పోతున్నట్టు చూడొచ్చు. 

ఘటన జరిగిన సమయంలో డ్యూటీ-ఇన్‌చార్జ్ డాక్టర్ శశాంక్ జిందాల్ ఆసుపత్రిలో లేరు. అయితే, పోలీసుల దర్యాప్తులో సునీల్ గురించి  తెలిసిన వెంటనే తాను ఆసుపత్రికి వచ్చి సునీల్‌కు సెలైన్స్ ఇచ్చి చికిత్స అందించానని డాక్టర్ జిందాల్ తెలిపారు. ఈరోజు  ఉదయం 7 గంటలకు సునీల్ మరణించగా, చికిత్స ఆలస్యం కావడం  వల్లే అతను చనిపోయాడని కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు. 

ఒకతను సహాయం కోసం అడుగుతుండగా జూనియర్ డాక్టర్ నిద్రపోతున్నట్లు వైరల్ వీడియోలో ఉంది. ఆ ఇద్దరు డాక్టర్లను డ్యూటీ నుండి సస్పెండ్ చేసాం, దర్యాప్తు ఇంకా జరుగుతోంది అని LLRM మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌సీ గుప్తా తెలిపారు. అయితే మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.