
- ఓల్డ్ బోయిన్ పల్లిలో 12 కిలోల పంచలోహాలతో తయారీ
సికింద్రాబాద్, వెలుగు: అయోధ్య రాముడి కోసం హైదరాబాద్ లో పాదుకలు సిద్ధమయ్యాయి. ఓల్డ్బోయిన్పల్లిలోని హష్మత్పేటకు చెందిన లోహశిల్పి పిట్టంపల్లి రామలింగాచారి శ్రీమద్విరాట్కళాకుటీర్ సంస్థకు పాదుకులను తయారు చేసింది. 12.5 ఇంచుల పొడవు,5.5 ఇంచుల వెడల్పు,1 ఇంచు మందంతో చేసిన ఈ పాదుకలకు బంగారం, వెండి, రాగి, సత్తు , తగరం అనే 12.6 కిలోల పంచలోహాలను వాడారు. ‘అయోధ్య భాగ్యనగరం సీతారామా సేవా ట్రస్ట్’ ఫౌండేషన్ స్థాపకులు చర్ల శ్రీనివాస శాస్త్రీ పాదుకల తయారీ పనులను కళాకుటీర్వ్యవస్థాపకులు, ప్రముఖ శిల్పి అయిన పిట్టంపల్లి రామలింగాచారికి అప్పగించారు. రామలింగాచారి మరో ఆరుగురు శిల్పులతో కలిసి పాదుకులు తయారు చేశారు.
25 రోజుల సమయం
శ్రీరాముడి పాదుకల తయారీ కోసం శిల్పశాస్ర్త గ్రంథాల్లో ఉన్న డిజైన్లు, పాత పాదుకలను పరిశీలించి రూపొందించారు. పాదాలపై శంఖు, చక్రాలు, గోమాత, ఏనుగు, జెండా, ఓం స్వస్తిక్, సూర్యచంద్రులు, రెండు కల్ప వృక్షాలు, కత్తి, అంకుశం, చేప, కలశం, రెండు పద్మాల గుర్తులు చెక్కారు. సీతమ్మవారికి అత్యంత ఇష్టమైన చింతాకు పతకాలకు గుర్తుగా రెండు ఆకుపచ్చని రాళ్లను చెన్నై నుంచి తెప్పించి పాదుకలపై అమర్చారు. వీటిని తయారు చేసేందుకు 25 రోజుల సమయం పట్టగా.. తయారీ తర్వాత గత నెల 30న అయోధ్యకు పంపించారు.
లోహ శిల్పకళపై పట్టు..
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం అంగడి కూర్మపల్లికి చెందిన రామలింగాచారికి లోహశిల్పిగా 40 ఏళ్ల అనుభవం ఉంది. 1993లో శ్రీమద్విరాట్కళాకుటీర్ను స్థాపించారు. అప్పటి నుంచి అనేక ఆలయాలకు దేవతామూర్తులను, గాలిగోపురాలను తయారు చేస్తున్నారు. యాదగిరి గుట్ట గర్భగుడిలో ఉత్సవ మూర్తుల, స్వామి కవచాలు, శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయంలో నాగాభరణాలు, కడపలోని బ్రహ్మంగారి మఠంలో ఈశ్వరీ దేవి సమాధి మండపం, హైదరాబాద్కర్మాన్ఘాట్లోని ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాలు, ఏడుపాయల టెంపుల్లో విగ్రహాలు తయారు చేశారు.