కేఎల్ఐ రైతుల అరిగోస.. బాగుపడని కాలువలు-కూలుతున్న దరులు

కేఎల్ఐ రైతుల అరిగోస.. బాగుపడని కాలువలు-కూలుతున్న దరులు
  •     మనిషి లోతు జమ్ముతో తప్పని తిప్పలు 
  •     రిపేర్ల పేరుతో ఎనిమిదేండ్లుగా కాలయాపన

నాగర్​కర్నూల్,​ వెలుగు: కూలుతున్న దరులు, మనిషిలోతు జమ్ము, కాలువలు ఎక్కిపారే నీళ్లు.. ఇలా 20 ఏండ్లుగా కేఎల్ఐ ఆయకట్టు రైతులు అరిగోస పడుతున్నారు. ఈ సారి ఎండాకాలంలో కాల్వలను రిపేర్​ చేస్తామని ఎనిమిదేండ్లుగా చెబుతూనే వస్తున్నారు. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కెనాల్స్​ కింద పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి ఏటా తిప్పలు తప్పడం లేదు. ఈ సారి యాసంగి పంటకు నీళ్లివ్వకుండా అక్టోబర్​లోనే కాల్వలు బంద్​ పెట్టిన ఇరిగేషన్​ ఆఫీసర్లు వానలు పడేలోపు కెనాల్స్​ రిపేర్లు, స్ట్రక్చర్లు, బ్రిడ్జిలు, స్లూయిస్​లు కంప్లీట్​ చేస్తామని హామి ఇచ్చారు. 

20 ఏండ్లు దాటినా ఇంకా ఆన్​ గోయింగ్​ ముద్ర పోని కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​ కింద చెరువులు నింపుడు, కాల్వలకు నీళ్లు ఇడుసుడు చేస్తున్నారు. ఇక నాలుగేండ్ల కింద మునిగిన కల్వకుర్తి మొదటి లిఫ్ట్​ పంప్​ల రిపేర్  పెండింగ్​లోనే ఉంది. జొన్నలబొగడ లిఫ్ట్​లో మూడేండ్ల కింద విప్పి పెట్టిన నాల్గవ పంప్​ పరిస్థితి అలాగే ఉంది. జొన్నలబొగడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్ల మధ్య  మెయిన్​ కెనాల్​ లైనింగ్​ కూలి ఐదేండ్లు దాటింది.  మెయిన్​ కెనాల్​ ఇట్లుంటే  డిస్ట్రిబ్యూటరీల సంగతి ఇంకా దారుణంగా తయారైంది.

పనులన్నీ పెండింగే..

కేఎల్ఐ ప్రాజెక్ట్​లోని 28వ ప్యాకేజీలో 84 కిమీలు, 29వ ప్యాకేజీలో 160 కిమీలు, 30వ ప్యాకేజీలో 80 కిమీల పొడవున కాలువలు ఉన్నాయి. 28వ ప్యాకేజీ కింద 70 వేల ఎకరాలు, 29వ ప్యాకేజీ కింద 1.80 లక్ష ఎకరాలు, 30వ ప్యాకేజీలో 90వేల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంది. 29వ ప్యాకేజీలో కొండారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు డి82 కెనాల్​ 69 కిమీల మేర నిర్మాణం జరుగుతోంది. 28వ ప్యాకేజీలో 14 కిమీలు,30వ ప్యాకేజీలో 15 కిమీల కెనాల్స్​ నిర్మించాల్సి ఉంది. 

ఇవన్నీ 2004లోని డీపీఆర్​ అగ్రిమెంట్​లో ఉన్నవే. ఇదిలాఉంటే కేఎల్ఐ ప్యాకేజీల కింద డిజైన్​ చేసిన ప్రకారం కాలువలు, డిస్ట్రిబ్యూషన్​ నెట్​వర్క్​ పూర్తి కాకముందే ఘన్​పూర్​ బ్రాంచ్​ కెనాల్, పస్పుల బ్రాంచ్​ కెనాల్​ కింద వనపర్తి నియోజకవర్గంలోని మండలాలను కలిపారు. మెయిన్​ కెనాల్​కు స్లూయిస్​ ఏర్పాటు చేసి నీటిని మళ్లించారు. అండర్​ టన్నెల్స్, తూముల నిర్మాణం జరగకపోవడం వల్ల పసుపుల, ఘణపూర్​ బ్రాంచ్​ కెనాల్స్​ ద్వారా విడుదల చేస్తున్న నీరు వాగులోకి చేరుతోంది. ఇక బ్రాంచ్​ కెనాల్స్, సబ్స్, మైనర్స్​ ఏర్పాటు చేయకపోయినా రైతులే మెయిన్​ కెనాల్​ నుంచి కిలోమీటర్ల కొద్ది పైప్​లైన్లు వేసుకొని నీటిని 
తరలించుకుంటున్నారు.

ఎనిమిదేండ్లుగా పనులు జరగట్లే..

కేఎల్ఐ మూడు లిఫ్టుల కింద 324 కిమీల పొడవున  కెనాల్​ మెయింటెనెన్స్​ పనులు 8 ఏండ్లుగా మరిచిపోయారు. పనులు పూర్తి చేసి ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు అప్పగించాల్సిన కాంట్రాక్టర్లు బిల్లులు, మెయింటెనెన్స్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. అదనంగా రిజర్వాయర్లు కట్టకుండా, కాలువలు రిపేర్​ చేయకుండా ఏటా సాగు విస్తీర్ణం మాత్రం పెంచుకుంటూ పోయారు. కొత్తగా దేవరకద్ర నియోజకవర్గాన్ని చేర్చారు. 

ఆ ప్రాంతానికి అదనంగా 30వేల ఎకరాలకు సాగు నీరిస్తామని రైతుల్లో ఆశలు కల్పించారు. 500 పైచిలుకు చెరువులు నింపేందుకు మినహా డైరెక్టుగా పొలాలకు నీరందించే నెట్​వర్క్​ సిస్టం లేకపోవడంతో రైతులు కాలువలకు మోటార్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. 28, 29, 30 ప్యాకేజీల కింద 21 వేల విద్యుత్​ పంప్​సెట్లు పనిచేస్తున్నట్లు అంచనా. కేఎల్ఐ కింద వానాకాలంలో 4.40 లక్షల ఎకరాలు సాగవుతోందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో వరిసాగు,2.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. ఇకనైనా కేఎల్ఐ ప్రాజెక్టు పెండింగ్​ పనులు పూర్తి చేయడంతో పాటు రిపేర్లను చేపట్టి వచ్చే వానాకాలం సాగునీళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

హెడ్​ రెగ్యులేటర్​ నిర్మిస్తేనే.. 

రెండు సార్లు ఎల్లూరు పంప్​హౌజ్​ మునగడానికి కారణం అప్రోచ్​ కెనాల్​ ముందు హెడ్​ రెగ్యులేటర్​ లేకపోవడమేనని తెలిసినా గత ప్రభుత్వం నిర్మాణానికి పూనుకోలేదు. డీపీఆర్​లో హెడ్​ రెగ్యులేటర్​ నిర్మించాలని ఉన్నా కాంట్రాక్ట్​ ఏజెన్సీ పట్టించుకోలేదు. అధికారులు గట్టిగా అడగలేదు. 2014, 2020లో రెండుసార్లు ఎల్లూరు పంప్​ హౌజ్​ మునిగింది. హెడ్​ రెగ్యులేటర్​ నిర్మిస్తేనే సర్జ్​పూల్​పై ఒత్తిడి తగ్గుతుందన్న నివేదికను పక్కన పడేశారు. ఒక్క 29వ ప్యాకేజీలోనే కాలువల మీద 6 కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా 20 నిర్మించాల్సి ఉంది. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ దాదాపుగా 28 వరకు యూటీ, తూముల నిర్మాణం జరగాల్సి ఉంది.